బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్‌ఎస్‌: జాజుల | Sakshi
Sakshi News home page

బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్‌ఎస్‌: జాజుల

Published Fri, Aug 25 2023 5:37 AM

Anti BC party BRS: Jajula Srinivasgoud - Sakshi

సాక్షి,యాదాద్రి/కాజీపేట రూరల్‌: ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసి తన వ్యతిరేకతను చాటుకున్న బీఆర్‌ఎస్‌ను వదిలేది లేదని, వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీ కి గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ సీట్ల కేటాయింపుపై గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అంటే రెడ్లు, రావుల సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెంటనే సవరించి 60 సీట్లను బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని 136 కులాల్లో కేవలం ఆరింటికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని, మిగిలిన 130 కులాలకు ప్రాతినిధ్యమే లేదన్నారు. మహిళలకు 7 టికెట్లు కేటాయించగా, అందులోనూ ఆరింటిని అగ్రకుల మహిళలకు ఇచ్చి, బీసీ మహిళలపట్ల వివక్ష చూపార ని ధ్వజమెత్తారు.

కాగా, హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్‌ వైష్ణవిగ్రాండ్‌ హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన వరంగల్‌ ఉమ్మడి జిల్లా బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా జనాభా ప్రకారం బీసీలకు సీట్లు ప్రకటించాలని, సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో తలపెట్టిన బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలు అధికారం కోసం తిరుగుబాటు చేయాలన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement