వానాకాలం ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయశాఖ
134.66 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు అంచనా
సాక్షి, హైదరాబాద్: వానాకాలం (ఖరీఫ్) సీజన్ పంటలకు వ్యవసాయ శాఖ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 134.66 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తూ...పంటల వారీగా విస్తీర్ణ లక్ష్యాలను ఖరారు చేసింది. ఇందులో వరి 69 లక్షల ఎకరాలు, పత్తి 48 లక్షల ఎకరాల్లో సాగవుతాయని భావిస్తోంది. మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, నూనెగింజల పంటలన్నీ కలిపి కేవలం 17.66 లక్షల ఎకరాల్లో సాగు కావొచ్చని అంచనా వేసింది. దీనికి అనుగుణంగా అవసరమైన విత్తనాలతోపాటు యూరియా, ఇతర ఎరువులను కూడా సిద్ధం చేస్తోంది. అయితే వ్యవసాయశాఖ లెక్కలకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నా యని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్య మేరుకు సాగు సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వరి, పత్తి సాగుకే రైతుల మొగ్గు
రైతులు ఇప్పటికీ వరి, పత్తి పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి, వరిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆ పంటల వైపే మొగ్గు చూపుతున్నాయి. మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 90 శాతం వరి, పత్తి పంటలకే రైతులు మొగ్గు చూపుతారని వ్యవసాయశాఖ చెబుతోంది. అయితే వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే మొదటి ప్రభావం కూడా వరి, పత్తిపైనే పడుతుంది.
గత ఏడాది 132 లక్షల ఎకరాల్లో..
గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో మొత్తం 1.32 కోట్ల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అందులో వరి 67.04 లక్షల ఎకరాలు, పత్తి 45.85 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.41 లక్షల ఎకరాలు, కందులు 4.92 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాలు ఉన్నాయి. మొత్తంగా సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100 శాతానికి పైగా సాగు నమోదైంది. గత ఏడాది మంచి వర్షాలు, చెరువులు–ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండటం వల్ల రైతులు ధైర్యంగా సాగు చేపట్టగలిగారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వేసవి ప్రారంభం నుంచే నీటి లభ్యతపై ఆందోళన నెలకొంది.
ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి నిల్వలు
రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం వంటి ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం పరిధిలోనూ నీటి లభ్యతపై రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. వానలు ఆలస్యమైతే దుక్కులు దున్నడం నుంచి నాట్ల వరకు మొత్తం వ్యవసాయ కార్యాచరణ ప్రభావితమయ్యే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగుపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించి, సాధారణ వర్షాలు కురిస్తేనే వ్యవసాయశాఖ నిర్దేశించిన 134 లక్షల ఎకరాల సాగు లక్ష్యం చేరుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. అందుకే ఈసారి ఖరీఫ్ భవితవ్యం పూర్తిగా వరుణుడి కరుణపైనే ఆధారపడి ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రైతాంగం ఇప్పుడు వానల రాక కోసం ఎదురు చూస్తోంది.


