
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటి మంచు లక్ష్మి బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈడీ అధికారుల బృందం ఆమెను ప్రశ్నించింది. ‘యో 247’ అనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వివరాలు సేకరించింది. గత మూడు సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ప్రశ్నించింది.
లక్ష్మి చెప్పిన వివరాలతో దాదాపు మూడు గంటల పాటు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ప్రధానంగా మంచు లక్ష్మి ప్రమోట్ చేసిన యాప్‌కు అనుమతులు ఉన్నాయా అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. ప్రమోట్ చేసినందుకు ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారనే వివరాలను ఈడీ అధికారులు సేకరించినట్లు సమాచారం.
బెట్టింగ్ యాప్ నుంచి మంచు లక్ష్మి బ్యాంక్ అకౌంట్లలోకి జరిగిన లావాదేవీల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. పారితోషికం, కమీషన్లకు సంబంధించిన వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. కొన్ని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించాలని ఆమెకు ఈడీ బృందం సూచించినట్లు తెలిసింది.