ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ మెరుపు దాడులు | ACB Raids In RTA Offices In Uppal and Tirumalagiri | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ మెరుపు దాడులు

Jun 27 2025 3:31 AM | Updated on Jun 27 2025 3:31 AM

ACB Raids In RTA Offices In Uppal and Tirumalagiri

తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్లను విచారిస్తున్న ఏసీబీ అధికారులు

తిరుమలగిరి, ఉప్పల్‌ కార్యాలయాల్లో సోదాలు 

పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారణ... ముందుగానే పసిగట్టి విధులకు డుమ్మా కొట్టిన అధికారులు 

సలాబత్‌పూర్‌ ఆర్టీఓ చెక్‌పోస్టుపై కూడా దాడులు

హుండీలాంటి డబ్బా పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తింపు 

కంటోన్మెంట్‌/ ఉప్పల్‌/మద్నూర్‌ (జుక్కల్‌): ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని సలాబత్‌పూర్‌ ఆర్టీఓ చెక్‌పోస్టులో కూడా సోదాలు చేశారు. గురువారం ఉదయం తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు.. అక్కడ తచ్చాడుతున్న సుమారు 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఒక్కో ఏజెంట్‌ వద్ద 50 వాహనాలు, లైసెన్సులు, రెన్యూవల్స్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు ఉన్నట్లు గుర్తించారు.

ఇన్‌చార్జి ఆర్టీఓ అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌ చేసి కార్యాలయానికి రావాలని సూచించారు. ఆర్టీఓ సిబ్బందిని కూడా విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. ఉప్పల్‌ ఆర్టీఏ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఏడుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి రూ.3,450 నగదు, మొబైల్‌ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. ఏసీబీ సోదాలను ముందుగానే పసిగట్టిన కొందరు అధికారులు సెలవులు పెట్టి వెళ్లినట్లు ఒక ఏసీబీ అధికారి అనుమానం వ్యక్తంచేశారు. సోదాల విషయం లీకవ్వడం వల్లనే ఆశించిన విధంగా పట్టుకోలేక పోయినట్లు తెలిపారు. 

ఆర్టీఓ చెక్‌పోస్టులో సోదాలు 
కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని సలాబత్‌పూర్‌ ఆర్టీఓ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. అక్కడ లెక్కలోకి రాని రూ.91 వేల నగదును గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ తెలిపారు. ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్న సమయంలో చెక్‌పోస్టు వద్ద ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కనిపించారు.

విధుల్లో ఉండాల్సిన ఏఎంవీవై కవిత, కానిస్టేబుల్‌ మొయినొద్దీన్‌ నిద్ర పోతున్నారు. ఏసీబీ అధికారులను గుర్తించిన మరికొందరు ప్రైవేటు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. చెక్‌పోస్ట్‌ పక్కన ఉన్న రేకుల షెడ్డులో ఏర్పాటుచేసిన ఒక డబ్బాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీల డ్రైవర్లు డబ్బులు వేస్తూ వెళ్తున్నారు. ఏసీబీ అధికారుల ముందే డ్రైవర్లు నగదును డబ్బాలో వేశారు. మొత్తం రూ.91 వేల అక్రమ నగదు లభించిందని డీఏస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement