
రోడ్ల మీదికి వస్తున్న ఏసీ కేబిన్ లారీలు
అక్టోబర్ ఒకటి నుంచి ట్రక్కుల్లో ఏసీ తప్పనిసరి
ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: భగభగమండే ఎండ వేడి.. బాగా వేడెక్కే ఇంజిన్ సెగ.. ఒళ్లంతా చెమటలతో తడిసి ముద్దయినా అలాగే ముందుకు సాగుతుంటారు లారీ డ్రైవర్లు. రోజులు, నెలల తరబడి వేడి సెగతో పోరాటం చేస్తూ విపరీతమైన అలసటకు గురవుతుంటారు. ఈ పరిస్థితి కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లారీ కేబిన్‌లలో కూడా ఎయిర్ కండిషన్ (ఏసీ) వసతి కల్పించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఏసీ కేబిన్‌తో కూడిన లారీలనే విక్రయించాలని కేంద్రం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ప్రధాన లారీ తయారీ కంపెనీలు ఏసీలతో కూడిన ట్రక్కులను ఇప్పటికే అందుబాటులోకి తెస్తున్నాయి. అవి లారీ డ్రైవర్లకు కొత్త అనుభవనాన్ని పంచుతున్నాయి.
ముందుగానే మొదలు
అక్టోబర్ ఒకటి నుంచి విక్రయించే ప్రతి సరుకు రవాణా ట్రక్కు కేబిన్‌లో ఏసీ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఏసీ కేబిన్ ఉన్న ట్రక్కులకే రోడ్డెక్కే అనుమతి ఉంటుంది. దీంతో ప్రధాన కంపెనీలు గడువు కంటే ముందే కొత్త ట్రక్కులను ఏసీ వసతితో అమ్మటం ప్రారంభించాయి. టాటా, అశోక్ లేలాండ్, భారత్ బెంజ్, ఐషర్ లాంటి ప్రధాన కంపెనీల ట్రక్కులు ఏసీతోనే వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు కోటి టన్నుల సరుకు వివిధ ప్రాంతాలకు ట్రక్కుల ద్వారా రవాణా అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆరు లక్షల టన్నుల వరకు ఉంటోందని అంచనా. తెలంగాణలో 5.8 లక్షల సరుకు రవాణా వాహనాలుంటే వీటిల్లో మూడు లక్షల వరకు లారీలే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రక్కుల సంఖ్య దాదాపు ఏడు లక్షల వరకు ఉంది. ఈ నేపథ్యంలో పాత లారీలకు కూడా ఏసీ వసతి కల్పించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
భిన్న వాదనలు
మన దేశంలో వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ దాటుతాయి. మరోవైపు భారీ లోడ్‌ను మోయాల్సి రావటంతో ట్రక్కుల ఇంజిన్లు ప్రయాణంలో విపరీతంగా వేడెక్కుతాయి. ఆ వేడి ట్రక్కు కేబిన్‌లోకి చేరుతుంది. అటు ఎండ, ఇటు ఇంజిన్ వేడితో డ్రైవర్లు అతలాకుతలం అవుతుంటారు. అధిక ఉష్ణోగ్రతలు డ్రైవర్లలో అలసట, డీహైడ్రేషన్, ఏకాగ్రత తగ్గడానికి కారణమవుతోంది. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది.
కేబిన్‌లో ఏసీ అమర్చితే వేడి ప్రభావం తగ్గటంలో డ్రైవర్లు త్వరగా అలసిపోరు. డ్రైవింగ్‌పై వారికి నియంత్రణ పెరుగుతుందని నిపుణలు చెబుతున్నారు. ఏసీల వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతాయని కొందరు వాదిస్తున్నారు. రోజుల తరబడి వాహనం నడిపే ట్రక్కు డ్రైవర్లు ఏసీ ద్వారా వచ్చే చల్లదనం వల్ల తొందరగా నిద్రలోకి జారుకునే ప్రమాదం ఉందని, ఇది ట్రక్కు ప్రమాదాలను మరింత పెంచుతుందని పేర్కొంటున్నారు.