సాక్షి, చైన్నె: తమిళనాడులో తమిళగ వెట్రి కళగం చీఫ్ సీ. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన , వీడియోను విడుదల చేసింది. ‘100 రోజుల పాలన ఒక శకానికి ప్రజల అంతరాత్మ పేరుతో ప్రజా సంబంధాల శాఖ ఈ వీడియోను రూపొందించింది.
ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన పథకాలు..
విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను తక్షణమే మూసివేసే ప్రతిపాదనపై సీఎం తొలి సంతకం చేయడం, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా రక్షణకై సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు గురించి వివరించారు. అన్న సారె, మేనమామ సారె అంటూ ప్రత్యేక 8 గ్రాముల బంగారు నాణెం, పట్టు చీర పథకాలు. బంగారు ఉంగరం పథకానికి రూ. 360 కోట్ల కేటాయింపు గురించి ప్రస్తావించారు. రైతులకు చెందిన రూ. 6,000 కోట్ల పంట రుణాల రద్దు, కర్మయోగి కామరాజ్ అల్పాహార పథకం, 11వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు, హెల్మెట్లు, వాటర్ బాటిళ్ల పంపిణీ, విక్టరీ స్కిల్ ట్రైనింగ్’ కింద 12 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ గురించి వివరించారు.తమిళనాడు ఇన్వెస్టర్స్ సమ్మిట్ 202 ద్వారా రాష్ట్రానికి రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లు తెలిపారు.అలాగే, వంద రోజుల విజయాల నివేదికను సైతం రూపొందించి సీఎం విజయ్‌కు మంత్రి రాజ్ మోహన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సాయికుమార్, సమాచార కార్యదర్శి రాజారామన్ , ప్రజా సంబంధాల డైరెక్టర్ అరుణ్ తంబురాజ్ తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులు
సచివాలయంలో వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎం విజయ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్‌లో ఇకపై కొనుగోలుదారు లు, అమ్మకందారులు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయానికి రాకుండానే తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా లాగిన్ అయి, ఐరిష్ లేదా వేలిముద్రల ధృవీకరణ ద్వారా పత్రాలను సమర్పించవచ్చు. అధికారు లు ఆన్‌లైన్‌లో తనిఖీ చేసిన పత్రాలను 20–24 గంటల వ్యవధిలోనే వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్రమాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు అరికట్టడానికి 5 రంగుల ఆటోమేటిక్ రాండమ్ కలర్ సిస్టమ్, ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ ఫీచర్లతో రిజిస్ట్రే షన్ పత్రాలను జారీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రి లోకేష్ తమిళ్ సెల్వన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా,సీఎం విజయ్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు మంత్రులు, టీవీకే నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.


