ఉదయనిధి విమర్శలు..
మంత్రుల కౌంటర్
డీఎంకే వాకౌట్
సీఎం వస్తే లేచి నిలబడాల్సిన అవశ్యం లేదు..స్పీకర్
రూ. 75 వేల వరకు రుణమాఫీ: సీఎం విజయ్
రూ. 75,000 వరకు
పంట రుణాలు పూర్తిగా మాఫీ..
సహకార బ్యాంకుల ద్వారా రైతులు పొందిన రూ. 75,000 వరకు ఉన్న పంట రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో శాసనసభ నిబంధన 110 కింద సంచలన ప్రకటన చేశారు. ‘తమిళనాడు ప్రజలు తమకు ప్రాణమైతే, రైతులు ప్రాణాధారం అని, ప్రపంచంలో కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సాగేది ఒక్క వ్యవసాయ రంగం మాత్రమేనని వివరించారు.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే (25 మే 2026) రూ. 50,000 వరకు రుణమాఫీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఆ తర్వాత దాన్ని రూ. 75,000 వరకు పెంచుతూ రూ. 5,932.23 కోట్ల రుణాలను మాఫీ చేస్తూ జూన్ 19న ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇప్పటివరకు రూ. 5,267 కోట్లు విడుదల చేసి 13.34 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వివిధ రైతు సంఘాల వినతులను పరిశీలించిన అనంతరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు మాఫీని ప్రకటిస్తున్నామని వివరించారు. రూ. 75,000 వరకు రుణాలకు 100% పూర్తిగా మాఫీ, రూ. 75,000 నుండి రూ. 1,00,000 వరకు రుణాలు గరిష్టంగా రూ. 75,000 వరకు మాఫీ, రూ. 1,00,000 కంటే ఎక్కువ రుణాలు.. గరిష్టంగా రూ. 35,000 వరకు మాఫీ చేస్తున్నామన్నారు. ఈ నిర్ణయం వల్ల రూ. 75,000 నుండి లక్ష రూపాయిల వరకు అప్పులు ఉన్న 2.38 లక్షల మంది రైతులకు అదనంగా మరో రూ. 40,000 వరకు ప్రయోజనం చేకూరనున్నదన్నారు. కాగా, అసెంబ్లీలో మంత్రి రంజిత్‌కుమార్ మాట్లాడే సమయంలో దివంగత డీఎంకే నేతను ఉద్దేశించి చేసినవ్యాఖ్యలు దుమారానికి దారి తీశాయి. డీఎంకే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో సీఎం విజయ్ జోక్యంచేసుకుని మంత్రికి హితవు పలుకుతూ, పేరును ప్రస్తావించడం తప్పు అని సూచిస్తూ, ఇందుకు తాను ఆయన తరపున క్షమాపణ కోరుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం విజయ్
సాక్షి, చైన్నె: అసంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయనిధి స్టాలిన్ సోమవారం టీవీకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ ‘‘100 రోజుల పాలనా ఘనతల గురించి గొప్పలు చెప్పుకుంటున్న టీవీకే ప్రభుత్వం, ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితిని కూడా గమనించాలి. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. కోయంబత్తూరులో విద్యార్థి దారుణ హత్యను కేవలం ‘గ్రూప్ తగాదా’ అని మంత్రి కొట్టిపారేస్తున్నారు.అయితే, గంజాయి,మత్తు పదార్థాల విక్రయాలపై ఫిర్యాదు చేసినందుకే తమ కుమారుడిని చంపేశారని బాధితుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. డీఎంకే హయాంలో డ్రగ్స్ నివారణకు సమర్థవంతంగా పనిచేసిన 15 మంది పోలీసు అధికారులకు అవార్డులు ఇచ్చారు. అసలు ఈ శాఖకు సంబంధించిన మంత్రి ఎక్కడున్నారు? ఆయన ఎందుకు సమాధానం చెప్పడం లేదు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
టీవీకే మంత్రుల ఘాటు కౌంటర్
దీనిపై న్యాయశాఖ మంత్రి నిర్మల్ కుమార్ స్పందిస్తూ... ‘‘కోయంబత్తూరు విద్యార్థి హత్య కేసును కొందరు కావాలనే పక్కదోవ పట్టిస్తున్నారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగింది తప్ప, దీనికి డ్రగ్స్ విక్రయాలతో సంబంధం లేదు. ఈ విషయంలో నిజాలను దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి గానీ, పోలీసులకు గానీ లేదు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సూత్రధారి జాఫర్ సాదిక్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఆ రోజుల్లో మాజీ సీఎం కుటుంబం నుంచి మంత్రుల వరకు అందరికీ అతనితో సంబంధాలు ఉన్నాయి. అయినా తమిళనాడులో అతనిపై కేసు నమోదు చేయలేదు. అయితే, తమ ప్రభుత్వంలో మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో అరికడుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి ఆధవ్ అర్జునా మాట్లాడుతూ... ‘‘ఈ 100 రోజుల్లోనే రాష్ట్రంలో డ్రగ్స్ సంస్క్కతి కొత్తగా రాలేదు. 2020 కంటే ముందు తమిళనాడులో ఇలాంటి పరిస్థితులు లేవు. డీఎంకే హయాంలో డ్రగ్స్ వాడకం తీవ్రం కావడమే లైంగిక దాడులు పెరగడానికి కారణమైంది. వారి పాలనలోనే పోక్సో కేసులు 40 శాతానికి పైగా పెరిగాయి. పోలీసు నివేదికల ఆధారంగానే నేను ఈ విషయాలు చెబుతున్నాను. ప్రజలు డీఎంకేను తిరస్కరించడానికి ప్రధాన కారణం డ్రగ్స్ నివారణలో వారి వైఫల్యమే. ప్రస్తుత టీవీకే ప్రభుత్వం డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది’’ అని స్పష్టం చేశారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్య
కోయంబత్తూరులో విద్యార్థి అముధన్ 10 రోజుల క్రితమే డ్రగ్స్ విక్రయించే ముఠా సమాచారాన్ని పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు ఆ ముఠాపై చర్యలు తీసుకోకుండా, సమాచారం ఇచ్చిన అముధన్ వివరాలను డ్రగ్ ముఠాకు చేరవేశారన్నారు. దాంతో సుమారు 20 మందితో కూడిన ఆ ముఠా అముధన్‌ను దారుణంగా కొట్టి చంపేసిందన్నారు. తిరువొత్తియూరులో కూడా ధనుష్ అనే విద్యార్థిని పట్టపగలే 20 మంది దాడి చేసి చంపేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం వల్ల రోజురోజుకూ శాంతిభద్రతల సమస్య తీవ్రమవుతోంది. సభలో తాము, ఇతర ప్రతిపక్ష నాయకులు డ్రగ్స్, శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... పాలకులు సరైన సమాధానం చెప్పకుండా మాపైనే తిరిగి నిందలు వేస్తున్నారని మండి పడ్డారు. ఈ 3 నెలల్లో ఏ శాఖకు ఎవరు మంత్రో కూడా సరిగా తెలియడం లేదన్నారు. శాంతిభద్రతలు, డ్రగ్స్ నిర్మూలనపై మాట్లాడుతుంటే దానికి పూర్తి బాధ్యత వహించాల్సిన సంబంధిత మంత్రి అసలు సభకే రాలేదన్నారు. సమాధానమూ ఇవ్వలేదన్నారు. ఈ వైఫల్యాలకు నిరసనగానే తాము వాకౌట్ చేశామని ఆయన పేర్కొన్నారు. మళ్లీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా అని మీడియా ప్రశ్నించగా... ‘కచ్చితంగా పాల్గొంటాం, అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కావాలని, అసలు ఆ శాఖ మంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలనియ ఉదయనిధి డిమాండ్ చేశారు.
తమిళనాడు శాసనసభలో డ్రగ్స్ నిర్మూలన, శాంతిభద్రతల అంశంపై అధికార తమిళగ వెట్రి కళగం(టీవీకే) ,ప్రధాన ప్రతిపక్ష డీఎంకే యకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. కోయంబత్తూరుకు చెందిన కళాశాల విద్యార్థి అముధన్ దారుణ హత్యపై డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రత్యేక దృష్టిసారించే తీర్మానాన్ని సోమవారం ప్రవేశ పెట్టారు.
డీఎంకే–టీవీకే మధ్య వాగ్వాదం
డీఎంకే వాకౌట్
తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంలో ఆయా శాఖల మంత్రులు తమ శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ డీఎంకే సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ వెలుపల ఉదయనిధి స్టాలిన్ విలేకరులతో మాట్లాడుతూ ఆరోపణలు గుప్పించారు.
కోయంబత్తూర్ కళాశాల విద్యార్థి అముధన్ హత్యకు పాత కక్షలే కారణమని, దీనిని మత్తు పదార్థాల (డ్రగ్స్) వ్యవహారంగా పక్కదోవ పట్టించవద్దని తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ శాసనసభలో తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి మంత్రి నిర్మల్ కుమార్ వివరణ ఇచ్చారు.కోయంబత్తూర్ కళాశాల విద్యార్థి అముధన్ హత్య కేసును వాస్తవాలకు భిన్నంగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఈ హత్యకు పాత కక్షలే కారణం తప్పా, దీనికి డ్రగ్స్ విక్రయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అముధన్ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశామని ఈ ఘటనపై 3 నెలల్లోపు చార్జ్‌షీట్ దాఖలు చేసి, నిందితులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన సభకు స్పష్టం చేశారు.


