సాక్షి, చైన్నె :‘‘సొంత దేశాన్ని, కన్నతల్లిని ఎలాగైతే ఎవరూ అవమానించరో... అలాగే తమిళ్ తాయ్ వాల్తు (రాష్ట్ర తమిళ తల్లి గీతం)ను మూడవ స్థానంలో పాటగా పాడటాన్ని కూడా అవమానంగా భావించకూడదని’’ అని భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. తిరువారూర్‌లోని తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు, డిగ్రీలు అందజేశారు. ఈ వేడుకలో మొత్తం 1,053 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు.
మహిళా విద్యలో పురోగతి
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, దేశంలో మహిళల ఉన్నత విద్య ప్రవేశాలు 2014–15లో 1.57 కోట్ల నుండి 2023–24 నాటికి 2.24 కోట్లకు (42.2 శాతం) పెరిగాయి. నేను హాజరయ్యే అనేక స్నాతకోత్సవాలలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో పట్టాలు పొందుతున్నా రు. ఇది శుభపరిణామం అని వ్యాఖ్యలు చేశారు.
వికసిత్ భారత్ 2047
ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకంగా వివరించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ ముఠాలపై పోలీసులు ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపకూడదన్నారు.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు తమ స్నేహితులను కూడా దూరంగా ఉంచాలని సూచించారు.
పరీక్షల అక్రమాల నిరోధక చట్టం
పార్లమెంటులో ఇటీవల ఆమోదించిన పోటీ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు పరీక్షల్లో పారదర్శకతను పెంచుతుందన్నారు. తాను జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి చట్టానికే ఆమోదం తెలిపానునని గుర్తు చేశారు.
తమిళ్ తాయ్ వాల్తు వివాదంపై స్పందన:
‘‘ఈ రోజుల్లో ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో తమిళ్ తాయ్ వాల్తు అందరికంటే ముందుగా (మొదటి పాటగా) పాడాలని స్పష్టం చేశారు. అయితే, తమిళ్ తాయ్ వాల్తును మూడవ పాటగా పాడినంత మాత్రాన దాన్ని తమిళ భాషను లేదా తమిళ మాతను అవమానించడంగా తీసుకోకూడదు’’ అని సూచించారు. ‘ ఎవరూ తమ కన్నతల్లిని, సొంత దేశాన్ని అవమానించుకోరు. అలాగే ఈ విషయాన్ని కూడా సానుకూలంగా అర్థం చేసుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో కూడా తమిళ్ తాయ్ వాల్తుకు మూడో స్థానం కల్పించారు. తొలుత వందే మాతరం, తదుపరి జాతీయ గీతం తర్వాత రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తమిళనాడులో ఎలాంటి కార్యక్రమంలో నైనా తమిళ్ తాయ్ వాల్తుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసినా ఆచరణలో విఫలం అవుతోండటం విమర్శలకు దారి తీస్తున్నది.ఈ కార్యక్రమంలో రాష్ట్రగవర్నర్ అర్లేకర్, తదితరులు పాల్గొన్నారు.


