– ఐఐటీ మద్రాసు ముందడుగు
సాక్షి, చైన్నె : సముద్ర పర్యావరణం , వాతావరణ మార్పులపై సముద్రపు బ్యాక్టీరియా చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –ఐఐటీ మద్రాస్ పరిశోధకులు ఒక సమగ్ర అధ్యయనం నిర్వహించారు.గ్లోబల్ ఓషన్ మైక్రోబయోమ్ ప్రాజెక్టు ద్వారా సేకరించిన 4,600కి పైగా శాంపిళ్లను పరిశీలించిన తర్వాత ధ్రువ ప్రాంతాల నుండి ఉష్ణమండల ప్రాంతాల వరకు సూక్ష్మజీవుల పరస్పర చర్యలు ఎలా మారుతున్నాయో ఐఐటీ మద్రాస్ బయోటెక్నాలజీ మరియు డేటా సైన్‌న్స్ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు.
అధ్యయనం ముఖ్యాంశాలు..
గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, ధ్రువ ప్రాంతాలలో ఉండే ప్రత్యేక సూక్ష్మజీవుల నెట్‌వర్క్ పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తుందని, ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఈ నెట్‌వర్క్ దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. వివిధ అక్షాంశాలలో బ్యాక్టీరియా సమూహాల ఏకీకరణ స్థిరత్వం వర్గీకరణ సరళిపై శాస్త్రవేత్తలు సమగ్ర విశ్లేషణ అందించారు.సముద్ర ఆరోగ్య పరిరక్షణతో పాటు గ్లోబల్ ఎకోసిస్టమ్‌లను రక్షించడంలో ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుందని ఐఐటీ మద్రాసులోని వధ్వాని స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐకు చెందిన ప్రొఫెసర్‌కార్తీక్ రామన్ తెలిపారు.ఐఐటీ మద్రాసులోని డబ్ల్యూస్‌ఏఐకి చెందిన పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకురాలు డాక్టర్ ఆర్తి రవీంద్రన్, ఐఐటీ మద్రాసులోని భూపత్ , జ్యోతి మెహతా స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్,బయోటెక్నాలజీ విభాగం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధిని ప్రణతి రవికుమార్‌లు మాట్లాడుతూ, సముద్ర సుక్ష్మ జీవుల సముదాయాలు ప్రధానంగా యాధృచ్చిక పర్యావరణ ప్రక్రియల ద్వారా రూపుదిద్దుకున్నప్పటికీ, యాధృచ్చికత, పర్యావరణ ఎంపిక మధ్య సమతుల్యత వివిధ సమయాలలో మారుతూ ఉంటుందన్నారు. తమ పరిశోధనలో న్యూట్రల్ కమ్యూనిటీ మోడలింగ్, ఫైలో జెనెటిక్ కమ్యూనిటీ అసెంబ్లీ అనాలిసిస్, మైక్రోబియల్ కో ఆకరెన్స్ నెట్‌వర్క్ అనాలిసిస్ వంటి అనేక అధునాతన పర్యావరణ విధానాలను మిళితం చేశామని వివరించారు.


