సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ తన పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే పది రోజులు అత్యంత కీలకం అని, అప్రమత్తంగా ఉంటూ, ప్రతి ఇంటికి వెళ్లి టర్లను ప్రసన్నం చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలు.. ఈనెల 23న ఓటింగ్‌కు జరగనున్న విషయం తెలిసిందే. ఈపరిస్థితులలో తన కేడర్‌కు సందేశం ఇస్తూ విజయ్ తన ఎక్స్ పేజీ ద్వారా ఒక పోస్టు చేశారు.
ఇంటింటి ప్రచారం
రాబోయే 10 రోజులు అత్యంత కీలకంగా పేర్కొన్నా రు. వీలున్న సమయాల్లో, ఉదయం, సాయంత్రం వేళల్లో నివాస ప్రాంతాల్లోని ప్రతి ఇంటినీ ఆయా ప్రాంతాలలోని కేడర్ సందర్శించాలని సూచించారు. ప్రజలను నేరుగా కలిసి టీవీకే అభ్యర్థులకు విజిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించాలని పిలుపు నిచ్చారు. పార్టీలో బూత్ స్థాయి బాధ్యతలు కలిగిన వారు, , సభ్యులుగా ఉన్న వారితో పాటు తనపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రస్థాయి ప్రచారంలో భాగస్వాములు కావాలని విజయ్ కోరారు.
మార్పు కోసం పయనం
మార్పు కోసం పోరాడుతున్న ప్రాథమిక శక్తి మనమే అని, మన విజయ పథంలో మనం సరైన దిశలోనే పయనిస్తున్నాం. చరిత్ర తిరగరాసే ఈ ప్రయాణంలో మీ ప్రతి ఒక్కరి పాత్ర చాలా విలువైనది అని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా సినీ నటుడు, స్టంట్‌మాస్టర్ పొన్నంబలం విజయ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. విజయ్ లాంటి సంస్కార వంతుడికి ప్రజలు మద్దతు ఇవ్వాలని పొన్నంబలం పిలుపు నిచ్చారు. కాగా, విజయ్ కడలూరు ఎన్నికల ప్రచారం రెండో సారీ రద్దు అయింది. కాగా ఈనెల 13న కన్యాకుమారిలో, 14వ తేదీన విజయ్ పుదుకోట్టైలో పర్యటించనున్నారు.


