– సీజ్ చేసిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ చైన్నెలో భారీగా డమ్మీ ఓటింగ్ యంత్రాలు పట్టుబడటం కలకలం సృష్టించింది. తనిఖీల్లో భాగంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. అన్నానగర్ నియోజకవర్గ పరిధిలోని అరుంబాక్కం 100 అడుగుల రోడ్డులో అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక లోడింగ్ ఆటో పట్టుబడింది. ఆ వాహనాన్ని సోదా చేయగా అందులో 100 డమ్మీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లభ్యమయ్యాయి. వీటితో పాటూ ఒరత్తనాడు డీఎంకే అభ్యర్థి ౖవైద్యలింగం ఫొటోతో కూడిన విజిటింగ్ కార్డులు ఉన్న 5 పార్శిళ్లను కూడా అధికారులు గుర్తించారు. ఈ పార్శిళ్లను సేలంకు చెందిన సెల్వం అనే వ్యక్తి తరలిస్తుండగా, ఆటోను అన్నానగర్‌కు చెందిన గణేశన్ నడుపుతున్నట్లు విచారణలో తెలిసింది. ఈ డమ్మీ ఈవీఎంలను ఒక ప్రైవేట్ బస్సు ద్వారా ఒరత్తనాడు నియోజకవర్గానికి పంపాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లకు ఓటు ఎలా వేయాలో వివరించడానికి, అభ్యర్థి గుర్తును ప్రదర్శించడానికి ఈ యంత్రాలను ఉపయోగించాలని భావించినట్లు తేలింది. ఈ డమ్మీ ఈవీఎంలు , ప్రచార సామాగ్రిని అన్నానగర్ ఎన్నికల అధికారి కార్యాలయానికి తరలించారు. ఈ వ్యవహారం ఒరత్తనాడు నియోజకవర్గానికి సంబంధించింది కావడంతో, తదుపరి చర్యల నిమిత్తం అక్కడి ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద ఈ కేసును అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సీబీఐ విచారణకు సిద్ధమా..?
– బీజేపీ సవాల్
సాక్షి, చైన్నె: నటుడు విజయ్ నటించిన జననాయకన్ సినిమా ఇంటర్నెట్‌లో లీక్ కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న ఆరోపణలను తమిళనాడు బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు కోరే ధైర్యం విజయ్‌కు ఉందా అని బీజేపీ సవాల్ విసిరింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఏ.ఎన్.ఎస్. ప్రసాద్ లు ప్రకటన విడుదల చేశారు.
విజయ్ రాజకీయ నాటకం
జననాయకన్ సినిమా లీక్ అవ్వడం వల్ల నిర్మాత కు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ, ప్రజల సానుభూతి ఓట్లను పొందేందుకు విజయ్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ లీక్‌కు కేంద్ర మంత్రి ఎల్. మురుగన్‌కు సంబంధం ఉంద ని టీవీకే నేత ఆధవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని మండిపడ్డారు.ఒక నిజాయితీ గల దళి త నేతను అవమానిస్తూ, మరోవైపు అంబేడ్కర్ సిద్ధాంతకర్త అని చెప్పుకోవడానికి విజయ్ సిగ్గుప డాలని ధ్వజమెత్తారు. సినిమా ఇంటర్నెట్‌లో లీక్ అయితే ఇప్పటి వరకు తమిళనాడు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? సెన్సార్ బోర్డును ఎందుకు సంప్రదించలేదు? ప్రశ్నించారు. కాగా ఈ లీక్ వ్యవహారంపై చైన్నె సైబర్ క్రైం విచారణ మొదలెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
డ్రైవర్‌కు గుండెపోటు
తిరువొత్తియూరు: వెళ్తున్న బస్సులో డ్రైవర్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్నచెట్లును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి. వివరాలు.. కోయంబత్తూరు నుండి గోపికి సుమారు 50 మంది ప్రయాణికులతో ప్రభుత్వ బస్సు వెళ్తోంది. కూగలూరుకు చెందిన ముత్తుసామి (46) బస్సు డ్రైవర్‌గా ఉన్నాడు. కసిపాళయానికి చెందిన కరుప్పుసామి (43) కండక్టర్‌గా వున్నారు .వేట్టైక్కారన్ కోవిల్‌లో ప్రయాణికులను దించి బస్సు గోపి వైపు వెళ్తున్న సమయంలో డ్రైవర్ ముత్తుస్వామికి స్వల్ప గుండెపోటు వచ్చింది. దీంతో అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ముత్తుసామి, నంజగౌండన్‌పాళయానికి చెందిన కాళియప్పన్ (65), అతని భార్య నిర్మలాదేవి (53), కోడలు, కళ్లిపట్టి సెంథిల్‌కుమార్, గోపి శక్తి శాంతి నగర్‌కు చెందిన తారిణి సహా పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వాహన డ్రైవర్లు క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం గోపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు.
పొలం పనుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి
సేలం:నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయసూర్యన్ గుర్తుపై పోటీ చేస్తున్న కేఎండీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్ పొలం పనుల్లో బిజీగా ఉంటూ ఓట్ల వేట సాగిస్తున్నారు. తాను రైతు అని చాటే దిశగా ఆయన దూసుకెళ్తున్నారు. మల్లసముద్రం యూనియన్ పరిధిలోని మెల్ముగం పనంగత్తూరు, సూర్య కౌండంపాలయం తదితర ప్రాంతాల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రచారం చేశారు. రైతులకు ఉచితంగా అందిస్తున్న సేవలను గుర్తు చేస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ముందు, నాగలికి ట్రాక్టర్‌ను కట్టి వ్యవసాయ భూమిలో విత్తనాలు నాటడం ద్వారా ప్రచారం నిర్వహించారు.


