హోం కార్యదర్శి ధీరజ్ సైతం మార్పు
మణివాసన్‌కు బాధ్యతలు
దేవాశీర్వాదానికి మళ్లీ పాత పోస్టింగ్
సందీప్ మిట్టల్ వెనక్కి
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం బదిలీని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. తమిళనాడు చరిత్రలో ప్రపథమంగా జరిగిన ఈ పరిణామంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు డీఎంకే కోశాధికారి, ఎంపీ టీఆర్ బాలు శనివారం లేఖ రాశారు. అదే సమయంలో హోంశాఖ కార్యదర్శి ధీరజ్‌కుమార్‌ను బదిలీ చేస్తూ, మణివాసన్‌ను ఆ స్థానంలో ఎన్నికల కమిషన్ నియమించడం చర్చకు దారి తీసింది. వివరాలు.. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అనేక జిల్లాల ఎస్పీలు, ఐఏఎస్‌లు, నగర కమిషనర్లను ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డీజీపీ వెంకట్రామన్‌ను తప్పించి ఆయన స్థానంలో సందీప్‌మిట్టల్‌ను, సీఎస్ మురుగానందంను తప్పించి సాయికుమార్‌ను నియమించారు. అలాగే ఇంటెలిజెన్స్, ఏసీబీ డైరెక్టర్లు వంటి అధికారులను సైతం బదిలీ చేశారు. చైన్నె పోలీసు కమిషనర్ అరుణ్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో అభిన్ దినేష్ మోథక్ నియమితులయ్యారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి దీరజ్‌కుమార్‌ను సైతం శనివారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కొత్త హోంశాఖ కార్యదర్శిగా మణివాసన్ నియమితులయ్యారు. ఈ బదిలీల పర్వం మరింత వేగవం పుంజుకోనున్నట్టు, కీలక అధికారులందర్నీ తప్పించే దిశగా ఎన్నికల కమిషన్ చర్యలు వేగవంతం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో సీఎస్ బదిలీని తీవ్రంగా పరిగణించిన డీఎంకే కోశాధికారి ఎన్నికలకమిషన్‌కు లేఖ రాశారు.
సీఎస్ బదిలీ అన్యాయం
తమిళనాడు సీఎస్‌గా ఉన్న ఎన్. మురుగానందాన్ని తొలగించి, ఆయన స్థానంలో సాయి కుమార్‌ను నియమించడం ఏకపక్ష నిర్ణయమని ఆ లేఖలో టీఆర్ బాలు విమర్శించారు. మురుగానందంపై ఏ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేయలేదని, ఆయనను మార్చడానికి సరైన కారణాలు లేవని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పారదర్శకత కోసం ఆయననే తిరిగి సీఎస్‌గా నియమించాలని డిమాండ్ చేశారు.
సందీప్ మిట్టల్ వెనక్కి..
ఈ లేఖ నేపథ్యంలో సందీప్ మిట్టల్‌ను మళ్లీ వెనక్క పంపించారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా ఉన్న డేవిడ్సన్ దేవాశీర్వాదం ఆ పదవిలోనే కొనసాగే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ పదవిలో నియమించ బడ్డ సందీప్ మిట్టల్‌ను గతంలో ఉన్న సాయుధ బలగాల విభాగానికే పంపించేశారు.
సందీప్ మిట్టల్ నియామకంపై అభ్యంతరం
సీఈసీకి టీఆర్‌బాలు లేఖ
అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ సందీప్ మిట్టల్‌ను నియమించడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. సందీప్ మిట్టల్ బహిరంగంగానే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి మద్దతు తెలుపుతున్నా అధికారి అని, ఆయన సోషల్ మీడియా పోస్టులే ఇందుకు నిదర్శనమని లేఖలో వివరించారు. సందీప్ మిట్టల్ గతంలో ముస్లింలు, వామపక్ష భావజాలంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని బాలు ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయన నియామకం ఎన్డీఏ కూటమికి ప్రయోజనం చేకూర్చేలా ఉందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్, బీజేపీకి ఏజెంట్‌లా పనిచేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ బదిలీలు, నియామకాలను రద్దు చేసి పాత స్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.


