తొలిసారి ఎన్నికల రేసులో
టీవీకే కన్వీనర్ ప్రభు
కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాంగుడి
అన్నాడీఎంకేలో ఏఏఎంకే అభ్యర్థిగా వీ పాండి
కారైకుడి పేరు వింటే అందరికీ గుర్తుకు వచ్చేది చెట్టినాడు వంటకాల స్పెషల్స్. రుచికరమైన వంటకాలు, మసాలాల ఘాటుకు పేరుగడించిన కారైకుడిలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. సొంత గడ్డలో ప్రపథమంగా నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ ఎన్నికల రేసులో నిలబడ్డారు. తన వాళ్లు ఆదరిస్తారన్న నమ్మకంతో ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. మళ్లీ గెలుపు తనదే అన్న ధీమాతో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ అభ్యర్థి మాంగుడి పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) అభ్యర్థిగా వీ పాండి, తమిళగ వెట్రికళగం (టీవీకే) తరపున ప్రభు రేసులో ఉన్నారు.
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో తాజాగా అందరి దృష్టి కారైకుడి వైపుగా ఉంది. స్టార్ నియోజకవర్గం జాబితాలోకి ఈ కారైకుడి చేరింది. శివగంగ జిల్లాలోని కారైకుడి వర్తకం, వ్యవసాయానికి కీలకం ఉంటున్నది. తమిళ తల్లికి ఇక్కడే ఆలయం కూడా ఉంది. అంతే కాదు పురాతన కొప్పుడయ నాయకీ అమ్మన్ ఆలయం కూడా ఇక్కడే ఉంది. పర్యాటకంగా, షూటింగ్‌లకు నెలవుగా ఇక్కడే చెట్టి నాడు ప్యాలెస్ కూడా ఉండటం విశేషం. ఇక ఈ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం గడ్డ. ఇక్కడ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు అందరి దృష్టి అన్న కారైకుడి వైపుగా మరలేందుకు కారణం సీమాన్. సినీ నటుడిగా, దర్శకుడిగా తమిళ నినాదంతో నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) వేదికగా రెండుదశాబ్దాలుగా ఒంటరి రాజకీయ ప్రయాణాన్ని సీమాన్ కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి ఎన్నికలలోనూ ఒంటరిగా పోటీ చేస్తూ క్రమంగా తన సత్తాను చాటుకుంటున్నారు. ప్రతి ఎన్నికలలో మహిళలకు యాభై శాతం సీట్లుతో పాటూ ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పిస్తూ వస్తున్న సీమాన్ 2024 ఎన్నికలతో తమిళనాట ఓ శక్తిగా అవతరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపును సైతం దక్కించుకునే రీతిలో 8 శాతానికి పైగా ఓట్లు సాధించారు.
పట్టం కట్టేనా..
రెండు దశాబాద్దాల పాటూ రాజకీయ ప్రయాణంలో ఎన్నో వివాదాలు, ఒడి దొడుగులు, కేసులు, అరెస్టులు, జైలు జీవితం అంటూ ముందుకు సాగిన సీమాన్ తాజా ఎన్నికలలో ప్రపథమంగా స్వయంగా పోటీకి సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన అభ్యర్థుల కోసం ఇన్నాళ్లు ప్రయాణం చేసిన సీమాన్ తాజాగా అసెంబ్లీలో అడుగు పెట్టడం లక్ష్యంగా కారైకుడిని ఎంపిక చేసుకున్నారు. తన సొంత జిల్లా అయిన శివగంగలోని కారైకుడి నుంచి పోటీ చేసే అవకాశాలు కలిసి వస్తాయన్న ధీమాతో సీమాన్ పోటీలో ఉన్నారు. గత ఏడాది కాలంగా ఆయన కారైకుడిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు దక్కిన నేపథ్యంలో పార్టీ గుర్తును క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సఫలీకృతుడయ్యారు. అయితే కూటమి బలం అన్నది కరువై ఒంటరిగా సీమాన్ ఎదురీతతో విజయ ఢంకా మోగించేనా అన్న ఎదురు చూపులు తాజాగా పెరిగాయి. పార్టీకి చెందిన కార్యకర్తలు, మహిళలు నిరంతరం ఓట్ల వేటలో సీమాన్‌కు మద్దతుగా ఉరకలు తీస్తుండడం విశేషం. వాస్తవానికి కారైకుడి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికలలో డీఎంకే మూడుసార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు గెలిచాయి. డీఎంకే కూటమి బలం, చిదంబరం చరిస్మాను సీమాన్ తట్టుకునే అసెంబ్లీలో అడుగు పెట్టేనా అన్నది వేచి చూడాల్సిందే.
ఓట్ల వ్యూహంలో ఏఎంఎంకే
అన్నాడీఎంకే కూటమిలో ఈ సీటును అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు అప్పగించారు. గతంలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు తనకు లభించిన ఓట్లకు తాజాగా కూటమి బలం తోడవుతుండటంతో గెలుపు తనదే అన్న ధీమాతో అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు అభ్యర్థిగా తేర్పొగి వీ పాండి ఉన్నారు. గత ఎన్నికలలో విడి విడిగా పోటీ చేసిన నేపథ్యంలో తాజాగా కూటమిలో ఉన్న పార్టీలకు వచ్చిన ఓట్లు కలిపితే, కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే ఎ క్కవేనని పాండి ధీమాతో ఉన్నారు. ఇక, గతంలో ఇక్కడ అన్నాడీఎంకే మూడు సార్లు గెలిచి ఉండటం తనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.
టీవీకేలో డాక్టర్ ప్రభు
కరైక్కుడిలో స్థానికుడైన డాక్టర్ ప్రభు విజయ్ టీవీకే తరపున పోటీ చేస్తున్నారు. స్థానికంగా వైద్యుడిగా ప్రభుకు మంచి పేరు, గుర్తింపు ఉండటంతో పాటుగా విజయ్ సినీ ఫాలోయింగ్, అభిమాన లోకం తన వెన్నంటే ఉంటుందన్న ధీమాతో ఈ అభ్యర్థి ఉన్నారు. విజయ్ ప్రచార పర్యటనకు ఇక్కడ అనూహ్య స్పందన రావడంతో ఓట్ల వేటలో మరింత వేగంగా ప్రభు ఉరకలు తీస్తున్నారు.
అదృష్టం ఎవరిని వరించేనో..
3.03,371 మంది ఓటర్లను కలిగిన ఈ నియోజకవర్గంలో చెట్టియార్, వెల్లాలర్, మొదలియార్ సామాజిక వర్గం ఓట్లు మరీ ఎక్కువే. రైతులు,రైతు కూలీ లు సైతం అధికంగానే ఉన్నారు.ఒంటరిగా తమిళ నినాదంతో ఒక్క ఛాన్స్ కోసం సీమాన్, అభివృద్ధి మంత్రం , కూటమి బలంతో మాంగుడి , ఓట్ల లెక్కలతో పాండిలు ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. అదే సమయంలో స్థానిక నినాదంతో టీవీకే తరపున ప్రభు దూసుకెళ్తున్నారు. ఈ చతుర్ముఖ సమరం కారైకుడిలో హోరాహోరీగా మారి ఉంది. నాలుగు ప్రధా న శక్తులు తలపడుతుండడంతో ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం ఉంది. దీంతో కారైకుడి అసెంబ్లీ పీ ఠాన్ని అధిరోహించేది ఎవరో ఉత్కంఠగా మారింది.
రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ అభ్యర్థిగా సీమాన్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాంగుడికి ఢీ కొడుతున్నారు.మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం, ఎంపీ కార్తీ చిదంబరం అండదండలు పుష్కలంగా మాంగుడికి ఉన్నాయి. గత ఐదేళ్లలో లా కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, టైడల్ పార్క్ వంటి అభివృద్ధి పనులు ఇక్కడ జరగడంతో అన్నీ తనకు సానుకూలం అన్న ధీమాతో మాంగుడి ఉన్నారు. అదే సమయంలో సిట్టింగ్‌ను పక్కన పెట్టాలని ,కాంగ్రెస్ వాదులు నినాదించినా, అధిష్టానం మాంగుడి వైపే మొగ్గు చూపింది. ఈ అంతృప్తి కాస్త మాంగుడికి గెలుపును దరిచేర్చేనా అన్నది వేచి చూడాల్సిందే.


