ప్రచారంలో శశికళ ఉద్వేగం | - | Sakshi
Sakshi News home page

ద్రోహుల్ని తరిమేద్దాం!

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 2:27 PM

-

సాక్షి, చైన్నె : దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి శశికళ ప్రచార బాట పట్టారు. తన పురట్చి తలైవర్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. దక్షిణ తమిళనాడులో ముక్కళత్తోర్‌ సామాజిక వర్గం అత్యధికంగాఉన్న ప్రాంతాలలో తన ప్రచారంలో శశికళ భావోద్వేగ ప్రసంగం చేస్తున్నారు. జైలు జ్ఞాపకాలు – ఆంక్షల పర్వం గురించి వివరిస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అన్నాడీఎంకే రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనను పార్టీ నుండి దూరం చేసేందుకు జరిగిన ప్రయత్నాలను ఆమె గుర్తు చేసుకుంటున్నారు. 

పార్టీని కాపాడటం కోసం బాధ్యతలు అప్పగిస్తే, తాను జైలుకు వెళ్లిన మూడవ నెలలోనే పార్టీ నుండి బహిష్కరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చినప్పుడు కనీసం పార్టీ జెండాను కూడా వాడనివ్వలేదని, జయలలిత సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్తే.. మరమ్మతుల సాకుతో మండపాన్ని మూసివేసి తనను అడ్డుకున్నారని ఉద్వేగానికి లోనయ్యారు. కేవలం కార్యకర్తలను, ప్రజలను కాపాడాలని పార్టీ కోరుకుందని, కానీ కొందరు స్వార్థం కోసం తనను అరెస్టు చేయాలని పోలీసులను కూడా ఆదేశించారని ఆమె విచారం వ్యక్తం చేశారు. 

ద్రోహుల్ని తరిమి కొడుదామని, కొబ్బరి తోట చిహ్నంపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. అన్నాడీఎంకేను మరో పార్టీకి తాకట్టు పెట్టేసి , స్వార్థ ప్రయోజనాల కోసం ఉవ్విళ్లూరుతున్న వారికి గుణపాఠం చెప్పాలంటే, తాను సూచించిన అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు.

Advertisement
 
Advertisement
Advertisement