కీలక నేతల నామినేషన్లకు ఆమోదం | - | Sakshi
Sakshi News home page

కీలక నేతల నామినేషన్లకు ఆమోదం

Apr 8 2026 7:32 AM | Updated on Apr 9 2026 2:51 PM

-

పెరంబూరులో విజయ్‌కు టెన్షన్‌ 

ఎడపాడిలో టీవీకే అభ్యర్థికి షాక్‌ 

దిండుగల్‌కు కొత్త చిక్కు

సాక్షి, చైన్నె : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో మంగళవారం కీలక నేతలకు ఆమోదం లభించింది. ఇందులో సీఎం స్టాలిన్‌, ప్రధాన ప్రతి పక్ష నేత పళనిస్వామి తదితరులు ఉన్నారు. ముఖ్యంగా టీవీకేఅ ధినేత విజయ్‌ నామినేషన్‌ టెన్షన్‌ పెట్టినా చివరకు ఆమోదించారు. ఇక, పళణిస్వామి పోటీ చేస్తున్న ఎడప్పాడి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి అరుణ్‌కు షాక్‌ తగిలింది. ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురి కావడంతో ఇక్కడ టీవీకే పోటీ నుంచి తప్పుకున్నట్లయ్యింది. వివరాలు.. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సోమవారం సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. మొత్తంగా 7,600 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పురుషులు 6,217, మహిళలు 1,380, ఇతరులు ముగ్గురు ఉన్నారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచి మొదలైంది. కట్టుదిట్టమైన ఆంక్షలు, సమగ్ర పరిశీలన మేరకు నామినేషన్లకు రిటర్నింగ్‌ అధికారులు ఆమోదం తెలియజేశారు. బుధవారం కూడా ఈ ప్రక్రియ జరగనుంది. గురువారం ఉప సంహరణ ప్రక్రియ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు.

నామినేషన్లకు ఒకే

చైన్నెలోని కొళత్తూరు నియోజకవర్గం నుండి నాలుగోసారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నామినేషన్‌ ఆమోదం పొందింది. అలాగే ఎడప్పాడి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నామినేషన్‌ కూడా ఓకే అయింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడైన విజయ్‌, తాను పోటీ చేస్తున్న పెరంబూర్‌ , తిరుచ్చి ఈస్ట్‌ రెండు నియోజకవర్గాల్లోనూ నామినేషన్లు ఆమోదించడంతో ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఖరారైంది. పెరంబూరులో నామినేషన్‌ అఫిడవిట్‌ రోటరి నకిలీగా చర్చ సాగడంతో విజయ్‌కు టెన్షన్‌ తప్పలేదు. చివరకు ఒరిజినల్‌ అని తేలడంతో నామినేషన్‌ ఆమోదించారు. 

అదేసమయంలో విజయ్‌ పేరును ఇరకాటంలో పెట్టే విధంగా జోషఫ్‌ పేరిట ఇద్దరు, విజయ్‌ పేరిట మరో ఇద్దరు దాఖలు చేసిన నామినేషన్లకు ఆమోదం లభించడం గమనార్హం. చేపాక్కం– ట్రిప్లికేన్‌లో ఉదయ నిధి స్టాలిన్‌, కారైక్కుడిలో నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌, సాత్తూరులో బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌, ధర్మపురిలో సౌమ్య అన్బుమణి, టీ నగర్‌లో భుస్సీ ఆనంద్‌ , అవినాశిలో కేంద్రసహాయమంత్రి ఎల్‌ మురుగన్‌, మైలాపూర్‌లో తమిళి సై సౌందరరాజన్‌ వంటి ముఖ్యుల నామినేషన్లు ఆమోదం పొందాయి.

విల్లివాక్కంలో ఉత్కంఠ

చైన్నెలోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి టీవీకే తరపున పోటీలో ఉన్న ఆదవ్‌ అర్జున నామినేషన్‌ ప్రస్తుతం నిలిపివేశారు. ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో భార్య ఆస్తుల వివరాలకు సంబంధించి కొన్ని సందేహాలు తలెత్తడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వెలువడటంతో ఉత్కంఠ తప్పలేదు. చివరకు సమగ్ర వివరాలను సమర్పించడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అలాగే, గోబిచెట్టి పాళయంలో ఆదాయ పన్ను సమర్పించ లేదంటూ టీవీకే కన్వీనర్‌ సెంగొట్టయ్యన్‌ నామినేషన్‌ పెండింగ్‌లో పెట్టారు. ఎడప్పాడి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి అరుణ్‌, ఆయనకు ప్రత్యామ్నాయంగా నామినేషన్‌ వేసి మరొకరి నామినేషన్లు తిరస్కరణకు గురి అయ్యాయి. దీంతో మాజీ సీఎం పళణిస్వామి ఓట్లకు చీలిక గండం తప్పినట్లయ్యింది. అదే సమయంలో అభ్యర్థి అరుణ్‌ కనిపించడం లేదంటూ టీవీకే వర్గాలు ఆరోపించాయి. 

ఇక, డీఎంకే తరపున పోటీలో ఉన్న నెహ్రు, అన్బిల్‌ మహేశ్‌ తదితర మంత్రలందరినామినేషన్లు ఆమోదించారు. ఇక, దిండుగల్‌లో మాజీ మంత్రి దిండుగల్‌ శ్రీనివాసన్‌కు చిక్కులు ఎదురయ్యాయి. ఇక్కడ రాందాసు తరపున నామినేషన్‌ దాకలు చేసిన అభ్యర్థిని పీఎంకే పార్టీకి చెందిన వారుగా ఎన్నికల కమిషన్‌ ఆమోదించింది. దీంతో ఇక్కడ అన్బుమణి పీఎంకేతో కూటమిలో ఉన్న అన్నాడీఎంకేకు చిక్కులు తప్పలేదు. మాజీ మంత్రి కేసీ వీరమణి నామినేషన్‌ను సైతం పెండింగ్‌లో పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement