పార్టీలో చేరిన వారంలో సీటు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ జాబితా విడుదల.. సిట్టింగ్‌లకు సీటు

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 12:35 PM

-

శ్రీపెరంబదూరులో సెల్వం పెరుంతొగై

పార్టీలో చేరిన వారంలోనే తమిళ్‌ కుమరన్‌కు సీటు

 

సాక్షి, చైన్నె: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను కాంగ్రెస్ విడుద‌ల చేసింది. సుదీర్ఘ మంతనాలతో కాంగ్రెస్‌ జాబితా ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం విడుద‌లైంది. ఇందులో శ్రీపెరంబదూరు నుంచి టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై మళ్లీ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారిలో 11 మంది సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం కల్పిస్తూ ఏఐసీసీ చర్యలు తీసుకుంది. అలాగే, కొత్త వారికి అత్యధికంగా సీట్లు కేటాయంచారు.

డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు 28 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. ఆది నుంచి సీట్ల సర్దుబాటుతోపాటు నియోజకవర్గాల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌లో వివాదాల నడుమ సాగుతూ వచ్చింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై సిద్ధం చేసిన జాబితాపై విమర్శలు, ఆరోపణలు బయలుదేరాయి. చివరకు ఏఐసీసీ పెద్దలు జోక్యం చేసుకుని గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు సాయంత్రం 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 

మదురై మేలూరు నియోజకవర్గానికి గట్టి పోటీ ఉండడంతో అభ్యర్థి ఎవరు అన్నది పెండింగ్‌లో పెట్టారు. గత ఎ న్నికలలో 18 మంది గెలవగా ఒకరు బీజేపీలోకి వెళ్లారు. మరొకరు మరణించడంతో ఆ సీటు కాస్త ఉప ఎన్నికలలో డీఎంకే ఖాతాలో చేరింది. మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలలో 11 మంది సిట్టింగ్‌లకు తాజాగా మళ్లీ అవకాశం కల్పించారు. వీరిలో సెల్వపెరుంతొగై, హసన్‌ మౌలానా, దురై చంద్రశేఖర్‌, గోపినాథ్‌, ఊర్వశి అమృతరాజ్‌, రూబీ మనోహరన్‌ ఉన్నారు. మిగిలిన స్థానాలలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులు

పొన్నేరి(రి)–దురైచంద్రశేఖర్‌, వేళచ్చేరి – హసన్‌ మౌలానా, శ్రీపెరంబదూరు– సెల్వపెరుంతొగై, షోళింగర్‌ –ఏఎం మునిరత్నం, ఊత్తంగరై(రి)– కుప్పుస్వామి,కృష్ణగిరి – చెల్లకుమార్‌, పెన్నగరం – జీకే ఎం తమిళ్‌కుమరన్‌, ఆత్తూరు (రి)–ఎస్‌కే అర్ధనారి, ఈరోడ్‌ ఈస్ట్‌– గోపినాథ్‌ పళణియప్పన్‌, ఊటి– పి.రామచంద్రన్‌, గౌండం పాళయం– సూర్యప్రకాష్‌, సింగానల్లూరు–శ్రీనిధినాయుడు, తురయూర్‌(రి)– విచ్చు లెనిన్‌ ప్రసాద్‌, కడలూరు– చంద్రశేఖరన్‌, మైలాడుతురై– జమాల్‌ యూనస్‌ మహ్మద్‌, అరంతాంగి–టి.రామచంద్రన్‌, కారైక్కుడి– ఎస్‌ మాంగుడి, ఉసిలంపట్టి– టి.శరవణకుమార్‌, శివకాశి–గణేశన్‌ అశోకన్‌, తిరువాడనై– రామకరుమాణిక్యం, శ్రీ వైంకుఠం–ఊర్వశి అమృతరాజ్‌, శంకరన్‌ కోవిల్‌(రి)–సెంగైగణేషన్‌, అంబాసముద్రం– వీపీ దురై, నాంగునేరి–రూబీమనోహరన్‌, కులచల్‌–తారగై, విలవన్‌ కోడ్‌ – టీటీ ప్రవీణ్‌, కిళ్లియూరు–రాజేష్‌కుమార్‌ పోటీచేస్తున్నారు.

పార్టీలో చేరిన వారంలో సీటు
పీఎంకేలో జీకే మణి కీలక నేత అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పీఎంకేలో వివాదాలు సాగుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసుకు మద్దతుగా జీకే మణి వ్యవహరిస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న జీకే మణి కుమారుడు తమిళ్‌కుమారన్‌ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరి వారం రోజులైన కాక ముందే ఆయనకు పెన్నగరం సీటు కేటాయించడం కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది.

Advertisement
 
Advertisement
Advertisement