స్టాలిన్‌ ప్రత్యర్థిగా సంతాన కృష్ణన్‌ | - | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే తుది జాబితా విడుదల

Mar 30 2026 8:37 AM | Updated on Mar 30 2026 6:39 PM

-

స్టాలిన్‌ ప్రత్యర్థిగా సంతాన కృష్ణన్‌ 

ఆర్మ్‌స్ట్రాంగ్‌ సతీమణికి సీటు

చైన్నెలో 12 చోట్ల పోటీ

సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అన్నాడీఎంకే అభ్యర్థుల 3వ జాబితా ఆదివారం విడుదలైంది. ఇందులో చైన్నెలో 12 చోట్ల అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై అభ్యర్థులు పోటీ చేయనున్నారు. సీఎం స్టాలిన్‌కు కొళత్తూరులో ప్రత్యర్థిగా జయ పైరవై సంయుక్త కార్యదర్శి సంతాన కృష్ణన్‌ను రంగంలోకి దించారు. వివరాలు.. అధికారమే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి వ్యూహాలకు పదును పెట్టి, ప్రజల్లోకి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కూటమి పార్టీలకు సీట్ల సర్దుబాటు ముగించారు. తమ అభ్యర్థులు తొలి జాబితాను 23 మందితో విడుదల చేశారు. 

అనంతరం 127 మందితో రెండో జాబితా ప్రకటించారు. తాజాగా 17 మందితో మూడో, తుది జాబితాను విడుదల చేశారు. ఇందులో చైన్నెలోనే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెండు నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులు కీలకంగా మారారు. వీరిలో ఒకరు బి సంతనా కృష్ణన్‌. ఈయన కొళత్తూరులో సీఎం స్టాలిన్‌ను అన్నాడీఎంకే అభ్యర్థిగా ఢీ కొడుతున్నారు. మరొకరు చేపాక్కం– ట్రిప్లికేన్‌లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఢీ కొట్టేందుకు ఆది రాజా రాం సిద్ధమయ్యారు.

మూడవ జాబితాలోని కీలక అభ్యర్థులు
కొళత్తూర్‌: బి. సంతాన కృష్ణన్‌, థౌజండ్‌ లైట్స్‌ – మాజీ మంత్రి బి వలర్మతి, అన్నానగర్‌ – మాజీ మంత్రి గోకుల ఇందిర, చేపాక్కం, ట్రిప్లికేన్‌ – ఆది రాజా రాం, ఆర్‌.కె. నగర్‌ – ఆర్‌.ఎస్‌. రాజేష్‌, విల్లివాక్కం– ఎస్‌.ఆర్‌. విజయకుమార్‌, వేళచ్చేరి– అశోక్‌, షోళింగనల్లూరు – కందన్‌, విరుగంబాక్కం– విరుగై వి.ఎన్‌. రవి, టి. నగర్‌ – మాజీ ఎ మ్మెల్యే సత్యనారాయణన్‌ అలియాస్‌ సత్య, హార్బర్‌ – రాయపురం మనో, ఎగ్మూర్‌ (రి)– అభిషేక్‌ రంగసామి పోటీ చేస్తున్నారు.

ఆర్మ్‌ స్ట్రాంగ్‌ సతీమణికి సీటు
బీఎస్‌పీ అధ్యక్షుడు ఆర్మ్‌ స్ట్రాంగ్‌ చైన్నెలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన మరణం తదుపరి పరిణామాలతో సతీమని పొర్కొడి ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తమిళనాడు బీఎస్పీ పేరిట పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆర్మ్‌ స్ట్రాంగ్‌ హత్యకు న్యాయం కోసం పోరాడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడు బీఎస్పీకి అన్నాడీఎంకే తరపున ఓ సీటును కేటాయించారు. అన్నాడీఎంకే రెండాకు చిహ్నంలో తిరువీకా నగర్‌ నియోజకవర్గం నుంచి ఆర్మ్‌ స్ట్రాంగ్‌ సతీమణి పొర్కుడిని అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు.

కృష్ణస్వామికి సీటు ఇచ్చే ప్రసక్తే లేదు: పళణి
అభ్యర్థులను ప్రకటించినానంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూత్తుకుడిలో పళని స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పుదియ తమిళగం అధ్యక్షుడు కృష్ణ స్వామి తనను సంప్రదించ లేదని స్పష్టం చేశారు. ఆయన మరొకరి ద్వారా తొలుత పది , ఆ తర్వాత 5 సీట్లకు పట్టుబట్టారని వివరించారు. గత ఎన్నికల్లో 31 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 33 వేల ఓట్లు మాత్రమే సాధించిన పార్టీకి అన్ని సీట్లు ఇవ్వడం అసాధ్యమని తేల్చి చెప్పినట్టు పేర్కొన్నారు. ఆయనకు గానీ, ఆ పార్టీకి గానీ సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

గతంలో తూత్తుకుడి, నైల్లె జిల్లాల్లో వచ్చిన భారీ వరదల సమయంలో డీఎంకే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. నటుడు విజయ్‌ తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఈ ఎన్నికలలో ద్విముఖ పోటీ మాత్రమే అని చెప్పడంపై స్పందిస్తూ.. ఆయన ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాతే ఆయనకు వాస్తవాలు అర్థమవుతాయి అని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement