175 లక్ష్యంగా డీఎంకే వ్యూహం | - | Sakshi
Sakshi News home page

175 లక్ష్యంగా డీఎంకే వ్యూహం

Mar 24 2026 7:58 AM | Updated on Mar 24 2026 1:25 PM

-

సాక్షి, చైన్నె: డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో 175 మంది అభ్యర్థులను నిలబెట్టే దిశగా వ్యూహ రచనలో ఆపార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ ఉన్నట్టు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆశావహులతో ఆయన ఐదు రోజుల పాటుగా నిర్వహించిన ఇంటర్వ్యూలు సోమవారంతో ముగిసింది. మంగళవారం లేదా బుధవారం నాటికి సీట్ల పంపకాలను ముగించి ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితా ప్రకటన దిశగా స్టాలిన్‌ కార్యాచరణలో ఉన్నారు. 

వివరాలు.. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు 28 స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. సీపీఐకు ఐదు ఇవ్వగా ఎండీఎంకేకు నాలుగు అప్పగించారు. అలాగే ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌కు, మనిద నేయక్కల్‌ కట్చి, కొంగు దేశీయ మక్కల్‌ కట్చిలకు తలా రెండు సీట్లు ఖరారు చేశారు. ఇక, సీపీఎం, వీసీకే, మక్కల్‌ నీది మయ్యం, డీఎండీకేకు సీట్లు కేటాయించాల్సి ఉంది. సీపీఎంకు ఐదు సీట్లు, వీసీకేకు ఐదు సీట్లు , మక్కల్‌ నీది మయ్యంకు రెండు, డీఎండీకేకు ఐదు చొప్పున సీటును డీఎంకే ఖరారుచేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, ఎస్‌డీపీఐతో పాటుగా మిగిలిన చిన్న పార్టీలకు తలా ఓసీటు ఇవ్వడానికి నిర్ణయించారు. 

సీపీఎం అయితే, ఐదు సీట్లు తీసుకునేందుకు ముందుకు వచ్చినా మిగిలిన ఆయా పార్టీలు లెక్కను అంగీకరించాల్సి ఉంది. అదే సమయంలో ఎండీఎంకే మూడు, మనిద నేయమక్కల్‌ కట్చి, కొంగు దేశీయ మక్కల్‌ కట్చి డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేయనున్నాయి. మక్కల్‌ నీది మయ్యంతో పాటుగా చిన్న పార్టీలన్నీ ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేసే విధంగా డీఎంకే సూచిస్తున్నది. దీంతో డీఎంకే తరపున 175 మంది అభ్యర్థులు రేసులో ఉండే దిశగా ఉదయ సూర్యుడి చిహ్నంపై పోటీకి కార్యాచరణలో ఉన్నారు.

ముగిసిన ఇంటర్వ్యూలు
డీఎంకేలో ఆశావహులను ఐదు రోజుల పాటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, ప్రధాన కార్యదర్శిదురై మురుగన్‌, కోశాధికారి టీఆర్‌బాలులు ఇంటర్వ్యూ చేస్తూ వచ్చారు. జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో మంత్రులు సైతం ఇంటర్వ్యూలకు హాజరై, తమ గెలుపు అవకాశాలు, నియోజకవర్గంలో బలం తదితర అంశాలను గురించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం ఉదయ నిధిస్టాలిన్‌ సైతం ఇంటర్వ్యూకు హాజరయ్యారు. 

సోమవారం డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్‌ నెహ్రు మంత్రి అన్బిల్‌ మహేశ్‌ తదితరులతో పాటుగా కావేరి తీర డెల్టా జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన ఆశావహులను స్టాలిన్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రక్రియను ముగించిన స్టాలిన్‌ అభ్యర్థుల ఎంపిక పై దృష్టి పెట్టారు. ముందుగా మంగళ, బుధవారం లోపు కూటమిలోని పార్టీలకు సీట్లను, నియోజకవర్గాలను ఖారారు చేయడానికి సర్దుబాటు కమిటీని ఆదేశించారు. ఈ ప్రక్రియ ముగియగానే, తొలుత మ్యానిఫెస్టో, ఆ తదుపరి అభ్యర్థుల జాబితా ప్రకటించి, రాష్ట్ర పర్యటనకు స్టాలిన్‌ సిద్ధం కానున్నారు.

ఉదయ నిధి ఆసక్తికరం..
కాగా, తనను ఇంటర్వ్యూలో పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అడిగిన ప్రశ్నలను ఓ మీడియాతో పంచుకుంటూ ఉదయనిధి స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య తేడా, నియోజకవర్గ ప్రజల మనో భావాలను గురించిన ప్రశ్నలను అడిగి, చివరకు వెళ్లి రండి... అభ్యర్థి ఎవరో అన్నది ఆలోచించి చెబుతామని పంపించేశారని చమత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement