టీఎన్‌సీసీ సరికొత్త ప్రచార అస్త్రం | - | Sakshi
Sakshi News home page

టీఎన్‌సీసీ సరికొత్త ప్రచార అస్త్రం

Mar 24 2026 7:58 AM | Updated on Mar 24 2026 1:31 PM

-

ఓటర్లకు పోస్టు కార్డు రూపంలో మ్యానిఫెస్టో

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ తన ప్రచారంలో వినూత్న పంథాను అనుసరించేందుకు చర్యలు చేపట్టింది. డీఎంకే కూటమిలో భాగంగా 28 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, తన ఎన్నికల ప్రణాళికను (మేనిఫెస్టో) నేరుగా ఓటర్ల గుమ్మం వద్దకే చేర్చేందుకు నిర్ణయించింది. పార్టీ ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్‌, ఎంపీ కార్తీ చిదంబరం నేతృత్వంలో ఈ మేరకు కసరత్తు జరుగుతోంది.

పోస్ట్‌కార్డులతో ఇంటింటికీ హామీలు
కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలోని అత్యంత కీలకమైన, ప్రజలకు ఉపయోగపడే ప్రధాన వాగ్దానాలను ఒక పోస్ట్‌కార్డుపై ముద్రించనుంది. పార్టీ పోటీ చేస్తున్న 28 నియోజకవర్గాల్లోని ప్రతి ఓటరు ఇంటికి ఈ పోస్ట్‌కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల పార్టీ హామీలు నేరుగా ప్రజల మనసుల్లోకి వెళ్తాయని నాయకత్వం భావిస్తోంది. 

మేనిఫెస్టో కమిటీ కసరత్తుల్లో భాగంగా చైన్నెలోని సత్యమూర్తి భవన్‌లో జరిగిన ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అనంతరం కార్తీ చిదంబరం మాట్లాడుతూ, కమిటీ ఇప్పటికే రెండు మూడు సార్లు సమావేశమై ప్రజా సమస్యలను అధ్యయనం చేసిందన్నారు. మార్చి 27 నాటికి తుది నివేదిక సిద్ధమవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల కోరికలు, సమస్యలను సేకరించడానికి ప్రత్యేక బృందాలను పంపించామన్నారు. వారు సేకరించిన సమాచారాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నామని వివరించారు.

ఈ నివేదికను ముందుగా ఢిల్లీలోని ఏఐసీసీ పంపించి, వారి ఆమోదంతో పోస్టు కార్డు ద్వారా ఓటర్లకు చేరవేయనుమన్నారు. తమిళనాడు ప్రజలను విశేషంగా ఆకట్టుకునే విధంగా ఈసారి మేనిఫెస్టో ఉంటుందని కార్తీ చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు మరియు రైతుల సమస్యలకు ఇందులో పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement