నగదు బట్వాడాపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

నగదు బట్వాడాపై ఉక్కుపాదం

Mar 23 2026 8:33 AM | Updated on Mar 24 2026 2:15 PM

-

రాజకీయ నాయకులను వణికించేలా నిఘా

అధికారులకు ప్రతాప్‌ సింగ్‌ ఆదేశం

సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ధనబలాన్ని ఉపయోగించే రాజకీయ నాయకులపై నిఘాను ముమ్మరం చేయాలని కేంద్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకుడు ప్రతాప్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి భయం కలిగేలా పర్యవేక్షణ కార్యకలాపాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్‌ నోడల్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ అభినవ్‌తో కలిసి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తమిళనాడుపై ప్రత్యేక దృష్టి
దేశంలోనే ఎన్నికల ఖర్చు అత్యధికంగా ఉండే రాష్ట్రంగా తమిళనాడును ఎన్నికల సంఘం గుర్తించింది. గతంలో 2016లో అరవకురిచ్చి, తిరుపరంకుండ్రం, 2017లో ఆర్‌.కె. నగర్‌ ఉపఎన్నికల్లో ధనప్రవాహం కారణంగా ఎన్నికలు రద్దు చేయబడిన విషయాలను ఆయన ఉదాహరణగా గుర్తు చేశారు. సాధారణంగా ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక వ్యయ పరిశీలకుడు ఉంటారని పేర్కొంటూ, ఈసారి తమిళనాడులోని 234 నియోజకవర్గాల కోసం ఏకంగా 151 మంది వ్యయ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించిందన్నారు. జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు సరికొత్త సాంకేతికతను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షించాలని ప్రతాప్‌ సింగ్‌ సూచించారు.అలాగే, ఈవీఎంల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మాజీ మంత్రి ఉదయకుమార్‌పై డీఎంకే ఫిర్యాదు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మదురై జిల్లా తిరుమంగళం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఏఐఏడీఎంకే కీలక నేత, మాజీ మంత్రి ఆర్‌.బి. ఉదయకుమార్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ నగదు పంపిణీ చేస్తున్నారని డీఎంకే వర్గాలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాయి.

మనీ లాండరింగ్‌ ఆరోపణలు
ఉదయకుమార్‌ తన సొంత ట్రస్ట్‌ ద్వారా భారీగా నగదు బదిలీలు చేస్తున్నారని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మదురై దక్షిణ జిల్లా డీఎంకే న్యాయవాదుల విభాగం ప్రతినిధి శివనేశన్‌, ఐటీ వింగ్‌ ఆర్గనైజర్‌ జయచంద్రన్‌ ఆరోపించారు. తిరుమంగళం నియోజకవర్గ పరిధిలోని టి. కున్నత్తూరులో ఉదయకుమార్‌ నిర్మించిన దివంగత సీఎం జయలలిత ఆలయాన్ని ఎన్నికల కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అక్కడ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిరంతరం భోజనాలు ఏర్పాటు చేస్తూ, నగదు పంపిణీకి వేదికగా మార్చుకున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, ఆ ఆలయంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, ఎన్నికలు ముగిసే వరకు ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని డీఎంకే నేతలు తిరుమంగళం ఎన్నికల అధికారి శివజ్యోతికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement