కన్నబిడ్డలను కడతేర్చి తల్లి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డలను కడతేర్చి తల్లి ఆత్మహత్య

Oct 19 2024 12:42 AM | Updated on Oct 19 2024 7:45 AM

-

భర్త ఆత్మహత్యా యత్నం 

సేలంలో కలకలం 

సేలం: కన్నబిడ్డలను కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడిన భార్యను చూసిన భర్త ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సేలంలో గురువారం రాత్రి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సేలం కొండలాంపట్టి సమీపంలో పోలీసుస్టేషన్‌ సమీపంలో పోలీసు క్వార్టర్స్‌ ఉంది. ఇందులో నివాసం ఉంటున్న గోవిందరాజ్‌ (38) సేలం జీహెచ్‌ పోలీసు స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య సంగీత (34), కుమారుడు రోహిత్‌ (7), దర్శికశ్రీ (5) కుమార్తె ఉన్నారు. పిల్లలు అదే ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి, ఎల్‌కేజీ చదువుతున్నారు. 

ఎప్పటిలాగే గోవిందరాజ్‌ గురువారం ఉదయం విధులకు వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంట్లో రోహిత్‌, దర్శికశ్రీ నేలపై మృతదేహాలుగాను, సంగీత ఉరి వేసుకుని మృతదేహంగా వేలాడుతూ కనిపించింది. దిగ్భ్రాంతి చెందిన గోవిందరాజ్‌ బోరున విలపిస్తూ తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతని అరుపులు విన్న పొరుగింటి వారు అక్కడికి చేరుకుని తొలుత గోవిందరాజ్‌ను రక్షించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్‌ వేల్‌మురుగన్‌, కొండలాంపట్టి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

తర్వాత సంగీత, రోహిత్‌, దర్శికశ్రీ మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తొలుత పిల్లలకు విషం కలిపి ఇచ్చి హత్య చేసిన సంగీత తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. అలాగే గోవిందరాజ్‌, సంగీత అప్పుడప్పుడు గొడవ పడుతున్నట్టు గాను, అలాగే గురువారం ఉదయం కూడా గొడవ జరిగిందని, రాత్రి వచ్చి చూడగా భార్య, పిల్లలు మృతదేహాలుగా కనిపించారని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని, గోవిందరాజ్‌ను పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement