సూర్యాపేటటౌన్ : వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకోవాలని, సమాచారం ఇవ్వాలని, రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయవద్దని ఉత్సవ కమిటీలకు, భక్తులకు విజ్ఞప్తి చేశారు. వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. మండపాలను రోడ్లపై ఏర్పాటు చేయవద్దని, అలా చేస్తే వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అత్యవసర సేవలు అందించే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైన చోట పగలు, రాత్రి పోలీస్ బీట్లు, పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవ కమిటీలు పోలీసులతో సమన్వయం చేసుకొని, నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నవరాత్రి వేడుకలు నిర్వహించాలని కోరారు.
లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని ఆదివారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధు ఫర్కపూజ, మాంగల్య ధారణ, తలంబ్రాలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, బ్రహ్మాచార్యులు పాల్గొన్నారు.
పశు ఔషధ బ్యాంక్‌కు
అధునాతన యంత్రం
కోదాడరూరల్ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన పశుఔషధ్ బ్యాంక్‌కు ఎన్‌ఆర్‌ఐ, పశువైద్యుడు డాక్టర్ వై.వెంకటరమణారెడ్డి రూ.40 వేల విలువైన ఎలక్ట్రో సర్జికల్ జనరేటర్‌ను ఆదివారం విరాళంగా అందించినట్లు వైద్యశాల డాక్టర్ పెంటయ్య తెలిపారు. ఈ యంత్రం శస్త్రచికిత్స సమయంలో పశువుల్లో రక్తస్రావాన్ని ఆపేందుకు దోహద పడుతుందని పేర్కొన్నారు. వెంకటరమణారెడ్డి ఇప్పటికే ఖనిజ లవణ మిశ్రమానికి రూ.50 వేలను విరాళంగా అందించినట్లు తెలిపారు.
టీయూజేఏసీ జిల్లా కార్యవర్గం
సూర్యాపేట : తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) జిల్లా అధ్యక్షుడిగా మీర్ సికందర్ అలీ మదనీ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా దారా నళిని నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాదులో నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు వారికి నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన జేఏసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


