ఇంటి వద్ద సాధనకు వర్క్‌బుక్స్
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అదనపు అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం వర్క్‌బుక్స్ అందుబాటులోకి తెచ్చింది. గతేడాది 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే వర్క్‌బుక్స్ అందించగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి 6 నుంచి 10వ తరగతి వారికి కూడా పంపిణీ చేశారు. అన్ని ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన వర్క్‌బుక్స్ అందడంతో తరగతిలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులు ఇంటి వద్ద చిత్రాలు, ప్రశ్నలు, అభ్యాస కార్యక్రమాల ద్వారా పాఠ్యాంశాలను మరింత ఆసక్తిగా నేర్చుకునే అవకాశం కలుగుతోంది.
950 పాఠశాలలు
జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వర్క్‌బుక్స్‌ను విద్యార్థులకు అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని పాఠశాలలకు వర్క్‌బుక్స్ చేరాయి. 1 నుంచి 5వ తరగతి వరకు 69,015 వర్క్‌బుక్స్, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1,29,590 వర్క్‌బుక్స్ వచ్చాయి. పాఠ్యాంశాలను కేవలం చదవడానికే పరిమితం కాకుండా ప్రశ్నలకు సమాధానాలు రాయడం, అభ్యాసాలు చేయడం ద్వారా 1 నుంచి పదవ తరగతి విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరగనుంది.
అభ్యాసమే లక్ష్యంగా..
వర్క్ బుక్స్‌లో పాఠ్యాంశాలకు అనుగుణంగా అభ్యాసాలు ఉండడంతో విద్యార్థుల అవగాహన స్థాయిని ఉపాధ్యాయులు సులభంగా అంచనా వేయగలుగుతారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా సాధన చేయించేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
ఫ గతేడాది నుంచే ప్రాథమిక స్థాయి
విద్యార్థులకు అందజేత
ఫ ఈ విద్యాసంవత్సరం 6 నుంచి
10వ తరగతుల వారికి..
ఫ విద్యా ప్రమాణాల మెరుగునకు దోహదం
తరగతిలో బోధించిన అంశాలను ఇంటి వద్ద సాధన చేసుకోవచ్చు. ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు రాయడం ద్వారా ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థులకు తమ అభ్యస సామర్థ్యాలను పెంచుకునేందుకు ఈ వర్క్‌బుక్స్ ఉపయోగపడతాయి.
– అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి


