ఆలేరురూరల్ : కుటుంబ సభ్యుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు బైపాస్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మద్దూంపూర్ గ్రామానికి చెందిన చీకటి ప్రదీప్ (26), అదే గ్రామానికి చెందిన చిలుకూరి కళాంజలి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం స్వగ్రామంలో బోనాల పండుగతో పాటు ప్రదీప్ పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు జరుపుకునేందుకు గాను శుక్రవారం సాయంత్రం అతడు బైక్‌పై హైదరాబాద్ నుంచి బయల్దేరాడు. కళాంజలిది కూడా అదే గ్రామం కావడంతో ప్రదీప్‌తో పాటు బైక్‌పై బయల్దేరింది. మార్గమధ్యలో ఆలేరు సమీపంలోకి రాగానే హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై బహద్దూర్‌పేట ఫ్లైఓవర్ దాటగానే వెనుక నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రదీప్, కళాంజలి రోడ్డుపై పడిపోయారు. ప్రదీప్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కళాంజలి కుడి కాలుకు గాయాలయ్యాయి. ఆమెను హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వినయ్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ప్రదీప్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఫ హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి
వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
ఫ మరో యువతికి తీవ్ర గాయాలు


