మఠంపల్లి : యువత మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మఠంపల్లి మండలంలోని అల్లీపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు గూడ నరసింహారావు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే తో పాటు మహాత్మా గాంధీ, అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఆయన జాతీయ జెండా చేతబూని మఠంపల్లి నుంచి చౌటపల్లి, బక్కమంతులగూడెం, త్రివేణినగర్, ఎర్రగట్టు, మగ్దుంనగర్ తదితర గ్రామాల మీదుగా 15 కిలోమీటర్ల మేర ఆయన ఈ రన్ చేస్తుంటారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదనే ఉద్దేశంతో 2018 నుంచి ఈ ప్రచారం చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. తన ప్రచారాన్ని నిరంతరం కొనసాగిస్తానని నరసింహారావు స్పష్టం చేశారు.


