చేతితో అల్లారు.. రికార్డు సృష్టించారు | - | Sakshi
Sakshi News home page

చేతితో అల్లారు.. రికార్డు సృష్టించారు

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

కోదాడ : పట్టణంలోని కొమరబండకు చెందిన తల్లీకూతుళ్లు మహంకాళి వసంతలక్ష్మి, లాస్యప్రియ నూలు దారం ఉపయోగించి చేతితో త్రివర్ణ పతాకాలను తయారుచేసి వాటిని దండలుగా మార్చి గిన్నిస్‌ రికార్డు సాధించారు. ఈ నెల 7న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ యాత్రలో 12.3 కిలోమీటర్ల ఈ జాతీయ జెండాల దండలను ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు.

మహిళా మనోవికాస గ్రూపు సాయంతో...

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సూరిభట్ల మాధవి ‘మహిళా మనోవికాస’ పేరుతో ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. సోషల్‌ మీడియా ద్వారా సుమారు 300 మంది మహిళలు ఈ గ్రూపులో సభ్యులుగా చేరారు. ఔత్సాహిక మహిళలు, బాలికలకు వారి అభిరుచుల మేరకు వివిధ కార్యక్రమాలను రూపొందించి వారిని భాగస్వాములను చేస్తుంటారు. ఇందులో భాగంగా నూలుదారంతో చేతితో జాతీయ జెండాలను తయారు చేసి, వాటిని ఒక దండలాగా కూర్చి అతి పొడవైన జాతీయ జెండాల దండను తయారు చేయాలని నిర్ణయించారు.

మేము సైతం అంటూ...

ఈ మహిళా మనోవికాస గ్రూపులో మహంకాళి వసంతలక్ష్మి, లాస్యప్రియ సభ్యులుగా చేరారు. గ్రూపులోని మరికొంత మంది సభ్యులతో కలిసి జాతీయ జెండాలను తయారు చేయడానికి ముందుకొచ్చారు. వీటి తయారీకి కావలసిన మూడు రంగుల నూలు దారాన్ని బెంగళూరు నుంచి సొంత ఖర్చుతో తెచ్చుకొని, ఇంటిలోనే వీరు జెండాలను తయారు చేయడం ప్రారంభించారు. ఇద్దరూ కలిసి రోజుకు రెండు జెండాల చొప్పున తయారు చేశారు. ఇలా గ్రూపు సభ్యులందరూ కలిసి తయారు చేసిన జెండాలను ఒక దండలాగా చేర్చగా అది 12.3 కిలోమీటర్ల పొడవుగా మారింది. ఈ నెల 7న విశాఖలో దీన్ని ప్రదర్శించగా, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు బృందం పరిశీలించి వీరికి అతి పొడవైన జాతీయ జెండాల ప్రదర్శన రికార్డును అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement