చిట్యాల : చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నాలుగు ఎకరాల స్థలంలో గాంధీ గుడిని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన మహాత్మాగాంధీ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. 2014 సెప్టెంబర్ 15న గుడిలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ గుడిలో నల్లరాతితో చెక్కిన గాంధీ విగ్రహంతో పాటు ధర్మచక్రాన్ని (అశోక చక్రం) ప్రతిష్ఠించారు. గుడి కింది అంతస్తులో ప్రత్యేకంగా ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఆలయ సమీపంలో పంచభూతాలు, నవగ్రహ దేవతల విగ్రహాలతో పాటు తులసి కోటను ఏర్పాటు చేయడం విశేషం. జైన దేవాలయాల్లో (దిలావర్) ఉపయోగించే ప్రత్యేకమైన గంట ఇక్కడ అమర్చారు. ఈ గుడిలో నిత్య పూజలు చేసే పూజారి కూరెళ్ల నర్సింహాచారి.. దేవుడికి మంత్రాలు చదివినట్లుగానే, గాంధీ స్తోత్రాలతో పూజలు చేస్తారు. గుడికి వచ్చే వారికి గాంధీజీ సిద్ధాంతాలను వివరిస్తుంటారు. పూజల అనంతరం భక్తులకు ‘డ్రై ఫ్రూట్స్’తో చేసిన ప్రసాదాన్ని అందించడం ఇక్కడి ప్రత్యేకత. భవిష్యత్ తరాలకు గాంధీజీ సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ గాంధీ గుడిని నిర్మించినట్లు మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు.


