సూర్యాపేట(సూర్యాపేటటౌన్) : దసరా, బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఉత్సవాల సందర్భంగా గొడవలు, ఘర్షణలకు తావివ్వవద్దని పేర్కొన్నారు. లక్కీ డ్రా, అనుమతి లేని ఇతర కార్యక్రమాలు నిర్వహించ వద్దని కోరారు. మండపం ఏర్పా టు చేసుకునే ముందు సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, రోడ్లపై మండపాలు ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విగ్రహాల తరలింపు సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ స్పష్టం చేశారు.
బుల్లెట్ రైలు సాధనే ధ్యేయం
సూర్యాపేట : జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్ రైలు కారిడార్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జిల్లా ప్రజలంతా ఉద్యమాలు చేస్తున్నారని, ప్రభుత్వం మొదట ప్రకటించిన అలైన్మెంట్ కొనసాగించాలని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న బుల్లెట్ ట్రైన్ సాధన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 52వ రోజు కొనసాగాయి. దీక్షలకు వారు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సమితి గౌరవ సలహాదారు రమణాచారి, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపెల్లి శివకుమార్ సాయంత్రం దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. దీక్షలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ సభ్యులు కొత్తపల్లి శివకుమార్, కొత్తపెల్లి రేణుక, పేర్ల నాగయ్య, పీడీఎస్‌యూ నాయకుడు అఖిల్, సంతోషిమాత, జటంగి వెంకట్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వీరికి పలువురు నాయకులు, స్థానికులు సంఘీభావం తెలిపారు.
ముగిసిన జిల్లాస్థాయి
అథ్లెటిక్స్ మీట్
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని పాత ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14, అండర్–16 విభాగాలలో నిర్వహించిన 9రకాల ఈవెంట్స్‌లో సుమారు 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బి.హరినాథ్, కె. ప్రవీణ్, సీహెచ్ నితిన్, ఈ.ప్రణయ్, సింధు, మౌనిక, వైష్ణవి, వినయ్‌లను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్.ఫౌండేషన్ సీఈఓ వీరయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, చెంబులింగం, మైసయ్య, కార్తీక్, సునీత, విజయ్, కళమ్మ, మల్లేశ్వరి, ముక్కంటి, పరమేష్, అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చెరుకు వెంకటేష్ పాల్గొన్నారు.


