గులాబీ రంగు పురుగు, పిండినల్లి పురుగు
పెద్దవూర: బీటీ పత్తిలో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించటం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం, సేంద్రియ ఎరువుల వాడకంపై మొగ్గుచూపటం, అధికారులు సిఫారసు చేసిన పురుగు మందులను వాడకంతో దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ తెలిపారు. యాజమాన్య పద్ధతులపై ఆయన పలు సూచనలు చేశారు.
పూత పద్ధతిలో..
తొలి దశలో ఆశించే పురుగులను అదుపు చేయటానికి కాండం మీద పూత పద్ధతిని పాటించాలి. 3 పర్యాయాలు 30, 45 రోజుల్లో మోనోక్రోటోఫాస్ 1:4(ఒక భాగం మందు, 4 భాగాలు నీళ్లు) నిష్పత్తిలో వాడాలి. తిరిగి 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ 1:20 నిష్పత్తిలో( ఒక పాళ్లు మందు, 20 పాళ్లు నీరు) వాడాలి. కాండం, పూత పద్ధతి ద్వారా పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి పురుగులను ఎటువంటి పురుగు మందుల పిచికారీ లేకుండా 70–80 రోజుల వరకు అదుపు చేసుకోవచ్చు. మందులను పిచికారీ చేయకపోవడం వలన తొలిదశలో మిత్ర పురుగుల సంతతి పెరిగి చీడపీడలను అదుపు చేయడంలో సహకరిస్తాయి. రసం పీల్చు పురుగుల నివారణకు 5 శాతం వేపగింజల కషాయం వాడాలి.
కాయతొలుచు పురుగు ఆశించే దశ..
60 నుంచి 90 రోజుల పంట దశలో పత్తి పైరులో సాధారణంగా పూత ఏర్పడిన దగ్గరి నుంచి కాయతొలుచు పురుగులు ఆశించటం మొదలవుతుంది. ముఖ్యంగా తలనత్త, శనగ పచ్చపురుగు, పొగాకు లద్దె పురుగులు పంటను వివిధ దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఎకరంలో 50 శాతం మొక్కల్లో కనీసం ఒక్కొక్క మొక్కను ఒక గూడ కంటే ఎక్కువ నష్టపోతే (పురుగు చేసిన రంధ్రంతో విచ్చుకున్న గూడలు) 5 శాతం వేపగింజల కషాయం పిచికారీ చేస్తే శనగపచ్చ పురుగు గుడ్లను, మొదటి దశ గొంగళి పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. బీటీ క్రిమి సంహారక మందులను బీటీ వంగడాలపై వాడకూడదు. వృక్ష మందులైన వేపగింజల కషాయం 5 శాతం లేదా 0.5 శాతం వేపనూనె లేదా 0.2 నుంచి 0.5 శాతం పిచికారీ చేయవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు లీటరు నీటికి 1.0 మి.లీ. నోవల్యూరాన్ లేదా 1.0 మి.లీ. లూఫెన్యూరాన్ లేదా ఇమామెక్టీన్ బెంజోయోట్‌ను 0.5 మి.లీ. పిచికారీ చేయాలి.
శనగపచ్చ పురుగు ఆశించు దశ..
90 నుంచి 120 రోజుల దశలో శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 90 రోజుల నుంచి బీటీ పత్తిలో గూడ, పిందెలలో ఉండే బీటీ ప్రోటీన్ స్థాయి క్రమేపీ తగ్గుతూ ఉండటం వలన శనగపచ్చ పురుగుల నియంత్రణ తగ్గుతూ ఉంటుంది. ఈ దశలో ఏవైనా గొంగళి పురుగుల నష్టపరిమితి స్థాయి గమనిస్తే 1 లేదా 2 పర్యాయాలు క్రిమి సంహారక మందులు ఉపయోగించటం ద్వారా పురుగును అదుపు చేయొచ్చు. థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా క్వినాల్‌ఫాస్ 2.0 మి.లీ. లేదా క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ. ను పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు సిఫార్సు చేసిన పురుగు మందులను 3మి.లీ. వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2.0 మి.లీ. ఫిప్రోనిల్ లేదా .03 గ్రాముల ఫ్లోనికామిడ్ లేదా 1.25 గ్రాముల డైఫెనిథియురాన్ లీటరు నీటికి కలిపి వాడాలి.
120 రోజుల తర్వాత దశలో గులాబీ రంగు పురుగు పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. గులాబీ రంగు పురుగు నష్టపరిమితి స్థాయిని గమనించి పత్తి పంటలో అక్కడక్కడా కొన్ని కాయలను కోసి తెరిచి చూడాలి. పది కాయలకు ఒక లార్వా ఉంటే నష్టపరిమితి స్థాయి అధిగమించినట్లుగా గుర్తించాలి. అవసరం మేరకు పంట చివరి దశలో ఒకటి లేదా రెండు పర్యాయాలు సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను పిచికారీ చేయడం ద్వారా పురుగును నివారించవచ్చు. పెద్ద గొంగళి పురుగులను ఏరి నాశనం చేయాలి. పిండినల్లి నివారణకు ఎసిఫేట్ లేదా ప్రొఫెనోపాస్ మందులను వాడాలి. పంట విత్తిన వెంటనే 45 రోజుల నుంచి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించినట్లయితే ఎకరాకు 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. బుట్టలో 8 తల్లి రెక్కలు పడినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.


