హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ (బాలుర) ఉన్నత పాఠశాలలో 1985–86లో పదోతరగతి చదివిన వారిలో కొంతమంది 2025లో కలుసుకున్నారు. అదే ఏడాది ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని 120 మిత్రులు కలుసుకున్నారు. ఈ సందర్బంగా వారికి ఆపదలో ఉన్న తమ తోటి మిత్రులను ఆదుకోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే మిత్రులు చామకూరి గురుపాదం, ఆకుల రాము, గోపాల్‌దాసు వెంకటేశ్వర్లు, ముక్కా ధనేష్, జనిగ శ్రీను, నిడిగొండ భిక్షపతి, మహబూబ్ అలీ, చింత్రియాల వెంకటేశ్వర్లు, చింతకాయల కోటయ్య, ముడంబై దామోదరాచార్యులు కలిసి ఒక కమిటీగా ఏర్పడ్డారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆత్మీయ సమ్మేళనం కోసం సేకరించిన డబ్బులో రూ.లక్ష మిగలడంతో ఆ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. వాటిని ఆపదలో ఉన్న మిత్రులను ఆదుకునేందుకు వినియోగించాలని సంకల్పించారు. అంతేకాకుండా ప్రతినెలా తమ స్నేహితుల్లో ఒక్కో వ్యక్తి కనీసం రూ.100 బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని తీర్మానం చేసుకున్నారు. అందులో నుంచి గోవిందపురానికి చెందిన తమ మిత్రుడు దివంగత గుజ్జుల శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహానికి 6 నెలల క్రితం రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. అంతేకాకుండా ఖమ్మంలో ఉంటున్న దివ్యాంగ మిత్రుడు కండె కష్ణారావుకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతడిని మిత్ర బందం పరామర్శించి తమ వంతు సాయంగా రూ.75 వేలు అందజేశారు. ఇటీవల మరో మిత్రుడి కుమార్తె వివాహానికి వెళ్లి రూ.10 వేలు అందజేశారు. ఇలా ఎవరికి ఏ ఆపద వచ్చినా వారిని గుర్తించి తోటి మిత్రులు ఆర్థికసాయం అందించి ఆదుకుంటున్నారు.
ఆస్పత్రిలో ఉన్న తమ మిత్రుడికి
ఆర్థికసాయం అందజేస్తున్న స్నేహితులు


