పెరుగుతున్న ‘ఆరుతడి’
ఈ రైతు పేరు మున్నా సైదులు. ఈయనది పెన్‌పహడ్ మండలం సింగారెడ్డి పాలెం. గ్రామ శివారులో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని దోసకాయ సాగు చేస్తున్నాడు. గతంలో బోరులో నీరు సంమృద్ధిగా ఉండటంతో వరి సాగు చేశాడు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో దోస కాయ సాగువైపు మళ్లాడు. ఈ ఏడాది నీరు సమృద్ధిగా ఉంటే వరిపంటే సాగు చేసేవాన్ని అని సైదులు పేర్కొన్నాడు.
ఈయన ఆత్మకూర్(ఎస్)
మండల కేంద్రానికి చెందిన సోమిరెడ్డి సందీప్‌రెడ్డి. తనకున్న పదెకరాలతోపాటు మరో
పది ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. గతేడాది పదెకరాల్లో వరిసాగు చేయగా, ప్రస్తుతం వర్షాలు సరిగ్గా లేకపోవడంతో ఇప్పటివరకు వరి వేయలేదు. ప్రస్తుతం 10 ఎకరాల్లో పెసర వేయగా, మిగతా 10 ఎకరాల్లో కూడా పెసర, మినుము, వేరుశనగ వేసేందుకు సిద్ధమయ్యాడు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. దీంతో ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని వ్యవసాయశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రైతులు ఈ వానాకాలం సాగు వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. గతంలో ప్రధానంగా వరిపైనే ఆధారపడిన రైతులు ఈసారి ఆరుతడి పంటలు, ముఖ్యంగా కంది, మినుములు, పెసర వంటి పప్పుధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఇప్పటికే వర్షాధారంగా సాగు చేసే పత్తి విస్తీర్ణం అనేక మండలాల్లో పెరిగింది. నీటి లభ్యతపై స్పష్టత వచ్చే వరకు వరి నాట్లను వాయిదా వేస్తూ ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుంటున్నారు. జిల్లాలోని పలు మండలాల రైతులు చేసిన సేద్యాన్ని పరిశీలిస్తే వరి సాగు అంచనాలు గణనీయంగా తగ్గగా, పత్తి సాగు ఆశించిన దానికంటే ఎక్కువగా నమోదవుతోంది.
రెండు జిల్లాల్లో ఇప్పటికీ అరకొర సాగే..
ఎల్‌నినో ప్రభావంతో నల్లగొండ జిల్లాలో ఈసారి అత్యధికంగా 5,57,934 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 2500 ఎకరాల్లో ఇప్పటికే కంది సాగు చేయగా, వంద ఎకరాల్లో పెసర, 50 ఎకరాల్లో మినుములు, 20 ఎకరాల్లో వేరుశనగ వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. అయితే జిల్లాలో 11.85 లక్షల సాగు విస్తీర్ణం ఇప్పటివరకు సగమే సాగు చేశారు. మిగితా రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే సూర్యాపేట జిల్లాలో పత్తి 68,730 ఎకరాల్లో సాగు చేయగా, కందులు 919 ఎకరాల్లో సాగు చేయగా, పెసర 1,210 ఎకరాల్లో, వేరుశనగ 122 ఎకరాల్లో సాగు చేశారు.
ఫ జిల్లాలో పెరుగుతున్న కంది
ఫ ఇప్పటికే అధికంగా పత్తి సాగు
ఫ భారీగా తగ్గిన వరి విస్తీర్ణం
ఫ ఎల్‌నినో ప్రభావంతో
సాగు విధానంలో మార్పులు
జిల్లాలో నీటి కొరత నేపథ్యంలో కంది, మినుములు, పెసర వంటి పప్పుధాన్యాల సాగు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం కంది విస్తీర్ణం ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే రైతులు ఆసక్తి చూపుతున్నారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లాలో కందులు ఈసారి లక్ష ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. పెసర, మినుములు, సోయా, చెరుకు వంటలవైపు రైతులు ఆలోచన చేస్తున్నారు. మోతె, నాగారం, తిరుమలగిరి మండలాల్లో కందుల సాగు పెరుగుతోంది. నడిగూడెం, మోతె, మద్దిరాల, నూతకల్ తదితర మండలాల్లో పెసర పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.


