మెరుగైన విద్యనందించడమే లక్ష్యం
మూత బడులు 81
సూర్యాపేటటౌన్ : తుంగతుర్తి మండలం బండరామారం జెడ్పీ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు సహా నలుగురు ఉపాధ్యాయులు సస్పెన్షన్‌కు గురికావడం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై చర్చకు దారితీసింది. సదరు పాఠశాలలో జీరో ఎన్‌రోల్‌మెంట్, విధుల్లో నిర్లక్ష్యం, విద్యార్థులను ఇతర పాఠశాలలకు వెళ్లేలా ప్రోత్సహించడం వంటి ఆరోపణలు రుజువు కావడంతో హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామం జిల్లాలోని మిగతా పాఠశాలల పనితీరుపైనా సమీక్షలు నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు..
జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4,118 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తూ.. వేలాది మంది విద్యార్థులకు విద్య అందిస్తున్నారు. బండరామారం పాఠశాలలో నెలకొన్న పరిస్థితులు, ఉపాధ్యాయుల సస్పెన్షన్ వ్యవహారంతో జిల్లాలోని మొత్తం ప్రభుత్వ పాఠశాలలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఎన్‌రోల్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి..
ప్రభుత్వం ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ సమయంలో ఒక హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్య సున్నాకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో పాఠశాల వయస్సు పిల్లలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో చేరకపోవడం వెనుక కారణాలపై అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా!
బండరామారం ఘటన నేపథ్యంలో జిల్లాలోని ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థుల నమోదు, హాజరు, బోధన, రికార్డుల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరుపై విద్యా శాఖ ప్రత్యేక సమీక్ష చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ అడ్మిషన్లు ఉన్న పాఠశాలలపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. ప్రభుత్వం మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, డిజిటల్ బోధన వంటి సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యతగా మారింది. విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ పాఠశాల ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలపై ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విద్యా శాఖ వర్గాలు అంటున్నాయి.
ఫ బండరామారం హైస్కూల్‌లో
హెచ్‌ఎంతో సహా నలుగురు సస్పెన్షన్
ఫ టీచర్ల మధ్య విభేదాలతో
జీరో ఎన్‌రోల్‌మెంట్
ఫ విద్యార్థులను ఇతర స్కూళ్లకు వెళ్లేలా ప్రోత్సహించడంతో చర్యలు
ఫ పాఠశాలల పనితీరుపై సమీక్షలకు
సిద్ధమవుతున్న జిల్లా విద్యా శాఖ?
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. బండరామారం హైస్కూల్‌లో ఉపాధ్యాయుల మధ్య బేధాభిప్రాయంతో జీరో ఎన్‌రోల్‌మెంట్‌కు వచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ ఐదుగురిని సస్పెండ్ చేశాం. ఉపాధ్యాయులంతా కలిసి కట్టుగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.
– అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి
జిల్లాలో గత ఏడాది అంతకు ముందు విద్యా సంవత్సరాల్లో వివిధ కారణాలతో 96 ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడ్డాయి. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి జిల్లాలోని ఆయా ఏజెన్సీ, తండాలు, గ్రామాల్లో 15 పాఠశాలలను తెరిపించారు. విద్యార్థులను ఆ పాఠశాలలకు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేశారు. అయితే ఇంకా 81 పాఠశాలలు మూతపడే ఉన్నాయి. విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లడంతో పాటు వివిధ కారణాలతో ఆ పాఠశాలలకు వెళ్లడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు తదితర వసతులు కల్పిస్తున్నా ఆ పాఠశాలలకు వెళ్లడం లేదు. దీంతో 81 పాఠశాలలు జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలుగా మిగిలిపోయాయి.


