హుజూర్‌నగర్ : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిపై ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవితో కలిసి మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దంపతులపై మల్లయ్య యాదవ్ చేసిన పలు ఆరోపణలను వారు ఖండించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి పనిలో కమీషన్ తీసుకుంది ఆయన కాదా అని ప్రశ్నించారు. మల్లయ్య యాదవ్ గురించి బీఆర్‌ఎస్ అధిష్టానానికి కూడా నమ్మకం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కాదుకదా కనీసం జడ్పీటీసీ టిక్కెట్ కూడా రాదని జోస్యం చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీని వాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మాజీ జెడ్పీటీసీ గల్లా వెంకటేశర్లు, సోషల్ మీడియా ఇన్‌చార్జి కిషోర్, నాయకులు పాల్గొన్నారు.
బాధితుల సమస్యలకు సత్వర పరిష్కారం
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన వారిలో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితుల సమస్య పరి ష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి చట్టబద్ధమైన విధానంలో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం
భానుపురి (సూర్యాపేట) : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతల మల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్యగౌడ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను కార్మికుల కోసమే వినియోగించాలని, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు స్పం దించి కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, నాయకులు ఏకలక్ష్మి, శ్రీకాంత్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహునికి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. కల్యాణోత్సవాన్ని విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుపర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు.


