భానుపురి (సూర్యాపేట) : హైదరాబాద్ – చైన్నె బుల్లెట్ ట్రైన్ కారిడార్ అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను మళ్లీ చేర్చాలని, ఇక్కడ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జానకిరెడ్డితో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం జాతీయ రహదారి–65పై ఉందని, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలక రవాణా కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. గతంలో ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌న్‌మెంట్‌లో సూర్యాపేటను చేర్చినప్పటికీ, ప్రస్తుత మూడో అలైన్‌మెంట్‌లో తొలగించడం వల్ల సూర్యాపేట జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు 20 సంవత్సరాలుగా రైల్వే మార్గం కోసం పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేశారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో జిల్లాను చేర్చక పోతే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా అధికారులు సూర్యాపేట ప్రజల అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్‌కు అందించారు. కార్యక్రమంలో అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో
కలెక్టరేట్ ఎదుట ధర్నా


