రేషన్‌ బియ్యం.. తెచ్చుకోవడం కష్టం ! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం.. తెచ్చుకోవడం కష్టం !

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

అనంతగిరి: కొత్త గ్రామపంచాయతీ ప్రజల రేషన్‌ కష్టాలు తీరడం లేదు. అనంతగిరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం కోసం ప్రతి నెలా రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు బియ్యం సంచులను భుజాన మోసుకుంటూ తెచ్చుకోవాల్సి వస్తున్నది. కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా రేషన్‌దుకాణాల మంజూరు చేయక పోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో దుకాణం ఏర్పాటు చేయాలని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరు గ్రామాల్లో అంతే..

మండలంలోని కొత్త గ్రామపంచాయతీలైన పాలారం తండా, అజ్మీర తండాలో రేషన్‌ షాపులు లేవు. పాత గోల్‌తండా ఆవాస గ్రామమైన మీట్యతండాలో, వెంకట్రాంపురం ఆవాస గ్రామమైన ఇందిరమ్మ కాలనీ, వసంతపురం ఆవాస గ్రామమైన తెల్లబండ తండాలోనూ ఇప్పటికీ ప్రభుత్వం రేషన్‌దుకాణాలు ఏర్పాటు చేయలేదు. పాలవరం ఆవాస గ్రామమైన రంగయ్యగూడెం, పాలారం తండాతో పాటు ఎస్సీ కాలనీకి చెందిన రేషన్‌ కార్డులను 22వ రేషన్‌ దుకాణానికి కేటాయించారు. ఈ దుకాణం రంగయ్యగూడెంలో నిర్వహించాల్సి ఉండగా డీలర్‌ పాలారంలో నిర్వహిస్తున్నాడు.

రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు

రేషన్‌ షాపులు లేని గ్రామాల ప్రజలు తమకు కేటాయించిన దుకాణం నుంచి రేషన్‌ బియ్యాన్ని తెచ్చుకునేందుకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తున్నది. ఆయా గ్రామాలకు తగిన రవాణా సౌకర్యం లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు లేని కుటుంబాలు బియ్యం సంచిని తలపై మోసుకుంటూ వస్తున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు మరీ ఇబ్బందిగా ఉంది. ప్రతి నెలా రేషన్‌బియ్యం తెచ్చుకోవడమే తమకు పెద్ద పరీక్షగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలారం తండా, అజ్మీర తండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసినా ప్రత్యేక రేషన్‌న్‌ దుకాణాలు మంజూరు చేయక పోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికా రులు స్పందించి పాలారం తండా, అజ్మీర తండా, మీట్యతండా, రంగయ్యగూడెం, వెంకట్రాంపురం, ఇందిరమ్మ కాలనీ, తెల్లబండ తండా గ్రామాలకు ప్రత్యేక రేషన్‌న్‌దుకాణాలు మంజూరు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

కొత్త పంచాయతీల్లో దుకాణాలు లేక అవస్థలు

బియ్యం కోసం రెండు కిలోమీటర్లు నడవాల్సిందే

వృద్ధులు, మహిళలు,

దివ్యాంగులకు మరీ ఇబ్బంది

కొత్త షాపులు ఏర్పాటు

చేయాలని వేడుకోలు

దుకాణాల ఏర్పాటుకు అక్టోబర్‌లో నోటిఫికేషన్‌

కోదాడ నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో నూతన రేషన్‌ దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేషన్‌ దుకాణం మంజూరు కావా లంటే గ్రామంలో 350 నుంచి 400 రేషన్‌ కార్డులు ఉండాలి. గ్రామాల్లో ఇప్పటికే కొన్ని కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేశాం, మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ పూర్తయ్యాక అర్హత కలిగిన గ్రామాలను గుర్తించి అక్టోబర్‌లో రేషన్‌ దుకాణాల ఏర్పాటు కోసం నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం.

– సూర్యనారాయణ, కోదాడ ఆర్డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement