శ్రీకాకుళం పాతబస్టాండ్: తుఫాను ప్రభావం వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితులను జిల్లా యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కళింగపట్నం వద్ద బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటిందని, ప్రస్తుతం జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలోనూ, పక్క జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి, వంశధార నదులకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. ముందుజాగ్రత్తగా జిల్లా వ్యాప్తంగా 86 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.


