● వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీగా వర్షాలు
● గాలివానతో రూ.62.29 కోట్ల మేర ప్రాథమిక నష్టం
● 7544హెక్టార్లలో వరి, 630.70 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు దెబ్బ
● 83 ఇళ్లు నేలమట్టం
● విద్యుత్ శాఖకు భారీ నష్టం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పాతబస్టాండ్) :
తీవ్ర వాయుగుండం తీరం దాటింది. జిల్లాకు నష్టాలు మిగిల్చింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు భారీ గాలులతో బీభత్సం సృష్టించింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో జిల్లా ప్రజానీకం అతలాకుతలమైంది. భారీ వర్షాలకు ఊళ్లకు ఊళ్లు ముంపునకు గురయ్యాయి. ప్రధాన పట్టణాలు జలదిగ్బంధానికి గురయ్యాయి. పంట పొలాలతో పాటు శివారు కాలనీలు కూడా ముంపు బారిన పడ్డాయి. ఈదురు గాలులు ఇళ్లు నేలమట్టం చేశాయి. చెట్లను పెకిలించేశాయి. విద్యుత్ స్తంభాలను కూల్చేశాయి. కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. వాగులు, గెడ్డలు, కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. రోఽడ్లు ధ్వంసమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం తీవ్ర వాయుగుండం నష్టం రూ.62.29 కోట్లు దాటింది.
అంతా జలమయం..
● ఎల్‌ఎన్‌పేట–ఏబీ రోడ్డుపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో కోవలాం కాలనీ, రోటరీ నగర్ జలమయమయ్యాయి.
● టెక్కలి భవానీనగర్‌లో ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది.
● నరసన్నపేట వీధుల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు. కామేశ్వరినగర్‌లో వాహనాలపై విద్యుత్ స్తంభం పడిపోయింది.
● రణస్థలం జాతీయ రహదారి ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో సర్వీసు రోడ్డులో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
● టెక్కలిలో పురుషోత్తమనగర్‌కు గండి పడటంతో మెళియాపుట్టి మార్గంలో రోడ్డుపై వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
● జి.సిగడాం మండలం గెడ్డ కంచరాం గ్రామంలో ఇళ్లు జల దిగ్బంధానికి గురయ్యాయి.
● ఆమదాలవలస మండలం బొడ్డేపల్లిపేట, పూజారి పేటకు మధ్యలో వరదనీరు చెరువును తలపించింది.
● నరసన్నపేట కామేశ్వరినగర్‌లో వాహనాలపై విద్యుత్ స్తంభం పడిపోయింది.
● గార మండలం శ్రీకూర్మం ఇందిరానగర్ కాలనీలో విద్యుత్ స్తంభం కూలి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
● పలాసలో వరహాల గెడ్డలోకి వరద నీరు పోటెత్తింది.
● లావేరు మండలం అదపాక వద్ద పెద్ద గెడ్డ పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
● కొత్తూరు హడ్డుబంగి గెడ్డకు వరదనీరు చేరడంతో కొత్తూరు రెల్లివీధిలోని ఇళ్లల్లోకి భారీగా వరదనీరు వచ్చేసింది.
● పొందూరు మండలం బాణాం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో వరదనీరు చేరి సరుకులు మునిగిపోయాయి.


