తన కుమార్తె పిన్నింటి ఊర్వశిని కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేశారని, అల్లుడు రాజారావు మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించారని, ఇప్పుడు తన మనవళ్లను సైతం చంపడానికి చూస్తున్నారని ఓ వృద్ధుడు సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ముక్కు పచ్చలారని పసిపిల్లలకు రక్షణ కల్పించాలంటూ మందస మండలం భేతాళపురం పంచాయతీ రట్టి గ్రామానికి చెందిన పులారి లోకనాథం ఎస్పీని వేడుకున్నారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..
బారువ పోలీస్‌స్టేషన్ పరిధి గొల్లూరు సమీపంలోని ఓ కర్రల కంపెనీలో పనిచేస్తున్న పిన్నింటి రాజారావుకు ఊర్వశిని ఇచ్చి వివాహం చేశారు. వరుడిది ఉమ్మడి కుటుంబం కావడంతో పెళ్లి సమయంలో రూ. 3 లక్షల నగదు, 4 తులాల బంగారం, 53 గొర్రెలు, ఇతర కానుక లు రాజారావు తల్లి వరహాలుకు అందించారు. కాలక్రమంలో ఆ కుటుంబంలో తగాదాలు రావడంతో రాజారా వు తాను వేరు పడతానని, తన వాటాను ఇవ్వాలని, భార్య తెచ్చిన కానుకలు సైతం ఇవ్వాలని కోరాడు. ఈ గొడవలు ముదరడంతో 2023లో రాజారావు సోదరులైన పిన్నింటి శివకుమార్, జయరాం భార్య యశోద మారణాయుధాలతో రాజారావు దంపతులపై దాడికి దిగారు. దీనిపై బారువ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 13న రాజారావు మరణాన్ని సహజ
మరణంగా చిత్రీకరించారని, అక్కడకు మూడు నెలల్లో జూన్ 18న కుమార్తె ఊర్వశిని దారుణంగా హత్య చేశారని లోకనాథం ఆరోపిస్తున్నారు. ఈ హత్యపై తన కుమార్తె మరిదైన పిన్నింటి శివకుమార్‌తో పాటు, అత్త వరహాలు, బావైన పిన్నింటి జయరాంలపై అనుమానం ఉందని ఆ సమయంలో బారువ పోలీ సులకు ఫిర్యాదు చేయగా ముగ్గురిౖపైనెతే కేసు నిలబడదని, ఒక్కరిపైనే కేసు నిలబడుతుందని చెప్పి శివకుమార్‌నే అరెస్టు చేశారన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన తన మనవలు పిన్నింటి సాత్విక్, పిన్నింటి వరుణ్‌తేజ్‌లపై పెద్దనాన్న జయరాం, చిన్నాన్న శివకుమార్ హత్యాప్రయత్నాలు చేస్తున్నారని, వారిని రక్షించాలని లోకనాథం ఎస్పీని కోరారు. పిల్లలు ప్రస్తుతం తన సంరక్షణలో ఉన్నారన్నారు.


