టీడీపీలో స్థానిక గుబులు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో స్థానిక గుబులు

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

‘సర్వేలు ప్రతికూలంగా ఉన్నాయి. అనుకూల మీడియాలు వ్యతిరేక కథనాలు రాయకతప్పడం లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కగలమా..?’ ఇప్పుడిదే టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. ఆ నాయకుల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. పోలీసు యంత్రాంగం, అధికార మంత్రాంగంతో ఏకపక్షంగా స్థానిక సంస్థలను కొట్టేద్దామన్న కలలు సాకారమయ్యేలా లేవు. ప్రతీ గ్రామంలో ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కనీసం పరువు కాపాడుకోగలమా అని టీడీపీ నాయకులు అంతర్మథనంలో పడ్డారు.

మోసం.. దగా

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. అభివృద్ధి, సంక్షేమం ఊసేలేదు. కొత్తవి పక్కన పెడితే గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు సైతం పూర్తి చేసే పరిస్థితి లేదు. గతంలో అమలైన సంక్షేమ పథకాలు ఎత్తివేశారు. ఇస్తున్న వాటిలో కోత పెట్టారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సక్రమంగా ఇవ్వలేదు. రాయితీలు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీలు అందడం లేదు. వరుణుడు ముఖం చాటేయడంతో పొలాలు ఎండిపోతున్నాయి. చంద్రబాబు వస్తే ప్రకృతి విపత్తు తప్పదనే పరిస్థితులను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. సాగునీటికే కాదు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. ప్రజల ముంగిటకు వైద్య సేవలు అందడం లేదు. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు. సరైన బ్యాగులు కూడా ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల ఊసే లేదు. ఉద్యోగ వర్గాల పరిస్థితి మరీ దారుణం. పాలకులు ప్రభుత్వ ఉద్యోగులను పురుగుల్లా చూస్తున్నారు.

దాడులు, దౌర్జన్యాలు

మద్యం ఏరులై పారుతోంది. ఇంటింటికీ తాగునీటిని అందించలేకపోయినా వీధికొక బెల్ట్‌షాపు పెట్టి విచ్చలవిడిగా మందు అందుబాటులో ఉంచారు. ఫలితంగా ఎక్కడికక్కడ గొడవలు చోటు చేసుకున్నాయి. గంజాయికి అడ్డు అదుపూ లేకుండా పోయింది. పేకాట, ఇతరత్ర జూదం ఎక్కువైపోయింది. ఏ ఒక్క నిరుపేద, మధ్యతరగతి కుటుంబంలో ప్రశాంతత లేదు. వీటికి తోడు అధికార పార్టీ నాయకుల దాడులు, గొడవలు, విధ్వంసకర ఘటనలతో ప్రజల్లో భయాందోళన ఏర్పడింది. ఇక, తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వేధిస్తున్న ఘటనలైతే చెప్పనక్కర్లేదు. సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికిస్తున్నారు. పలాస, టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో లెక్కకు మించి బాధితులు ఉన్నారు.

అక్రమాలు, ఆక్రమణలు

ఎంఆర్‌పీకి మించి విక్రయాలతో మద్యం దోపిడీ సాగిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నదులతో పాటు రోడ్లను కూడా ఛిద్రం చేస్తున్నారు. ఎక్కడ కొండలు కన్పిస్తే అక్కడ తవ్వేస్తున్నారు. కంకర, గ్రావెల్‌ దోచేస్తున్నారు. విలువైన గ్రానైట్‌ తవ్వకాలు జరిపి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులు తవ్వి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములే కాదు ప్రైవేటు వ్యక్తుల జిరాయితీ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నాసిరకం రోడ్లు వేసి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేశారు. ప్రజలకు ఉపాధి లేకపోయినా అధికార పార్టీ నాయకులకు మాత్రం దండిగా సొమ్ములు వస్తున్నాయి. ఎక్కడా చూసినా అవినీతి, అక్రమాలు, ఆక్రమణలే. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు ఇదే పరిస్థితి. దోపిడీ విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు.

అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి

కూటమి పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. ఎక్కడా చూసినా ప్రజల్లో వ్యతిరేకతే కనిపిస్తోంది. అభివృద్ధి పబ్లిసిటీ, రీల్స్‌లో తప్ప క్షేత్రస్థాయిలో లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే ఏమైనా ఉందా? ఇప్పుడదే పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటోంది. సర్వేలన్నీ అదే చెబుతున్నాయి. వైఎస్సార్‌సీపీని ఆపలేరని, ఇప్పు డు ఎన్నికలొస్తే ఆ పార్టీయే విజయం సాధిస్తుందని సర్వే యాజమాన్యాలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఐఐటీ నిపుణులు చేసిన సర్వేల్లో కూడా వైఎస్సార్‌సీపీకే పట్టం కడుతున్నాయి. దీంతో స్థానిక సంస్థలన్నీ తమ ఖాతాలో వేద్దామనుకున్న కూటమి పార్టీల కలలు కల్లలవుతున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ రోజురోజుకూ బలపడుతోంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ దక్కించుకుంటోంది. పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా జనాదరణ అంచనాలకు మించి కనిపిస్తోంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల జరిగిన జిల్లా పర్యటన జన సునామీలా సాగింది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువైతేనే ప్రతిపక్షానికి ఆ స్థాయిలో ప్రజలు పోటెత్తుతారనేది తెలిసిన విషయమే. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా రాజీపడొద్దని, ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. దీంతో ఎన్నికల్లో విజయభేరి మోగించి, సత్తా చాటాలని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ తరుణంలో ఎన్నికల నుంచి బయటపడటానికి కూటమి పార్టీలకు పోలీసు యంత్రాంగం, అధికార మంత్రాంగం తప్ప మరో దారి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైఎస్సార్‌ సీపీకే పట్టం కడుతున్న సర్వేలు

ఇటీవల జన సునామీగా సాగిన

వైఎస్‌ జగన్‌ పర్యటన

ప్రజలు విశ్వాసం చూరగొన్న ప్రతిపక్ష పార్టీ

వెన్నుపోటు పార్టీకి చుక్కలు తప్పవంటున్న విశ్లేషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement