● కుంగిపోతున్న తారురోడ్డు
● కడపలవానిగెడ్డ వద్ద కల్వర్టు పనుల్లో నాణ్యతాలోపం
● మండిపడుతున్న స్థానికులు
హిరమండలం : లక్షల రూపాయలతో కల్వర్టు నిర్మించారు. అనుసంధానంగా 40 మీటర్ల తారురోడ్డు నిర్మించారు. కానీ నిర్మించిన నాలుగు నెలల వ్యవధిలోనే రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. ద్విచక్ర వాహనాలు తప్ప నాలుగు చక్రాల వాహనాలు వెళ్లేందుకు వీల్లేకుండా మారింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఎల్‌ఎన్‌పేట మండలంలో అలికాం–బత్తిలి ప్రధాన రోడ్డులో తురకపేట, దబ్బపాడు, మిరియాపల్లి ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే రహదారిని ఎల్‌ఎన్‌పేటకు కూడా అనుసంధానించారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ రోడ్డులో తురకపేట, దబ్బపాడు మధ్య కడపలవానిగెడ్డ ఉంది. ఇక్కడ వంతెన నిర్మాణంతో పాటు అనుసంధాన రోడ్డు నిర్మాణానికి రూ.67 లక్షలు కేటాయించారు. పనులు పూర్తై ఈ ఏడాది ఏప్రిల్‌లో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో నాలుగు నెలలకే రోడ్డు కుంగిపోయింది. బెర్ములు కిందకు దిగిపోయాయి. కొంచెం బరువుతో వాహనం వస్తే చాలు రోడ్డు ఉబికిపోయి ముందుకు కదలని దుస్థితి. పనుల్లో నాణ్యతకు, నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంత ఘోరమా..?
రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చా రు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఈ విషయంలో జిల్లా యంత్రాంగం స్పందించాలి. రోడ్డును సరిచేయకపోతే ఉద్యమిస్తాం. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం


