వెలుగు పంచుదాం..! | - | Sakshi
Sakshi News home page

వెలుగు పంచుదాం..!

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

కనులు మూసినా..

● నేత్రదానంతో మరొకరి

జీవితంలో వెలుగు

● సెప్టెంబర్‌ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు

● విస్తృతంగా

అవగాహన కల్పిస్తున్న

అధికారులు

అవగాహన తప్పనిసరి

ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, ఎప్పటికప్పుడు నేత్ర వైద్య నిపుణులతో కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా చూపును సంరక్షించుకోవచ్చు. ప్రస్తుతం చిన్నారులు గంటల తరబడి మొబైల్‌ ఫోన్లు, ఇతర డిజిటల్‌ పరికరాలను ఉపయోగించడం వల్ల చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలి.

– ఎంఆర్‌కే దాస్‌,

ఆప్తాల్మిక్‌ అధికారి, నేత్రదాన మోటివేటర్‌

ప్రోత్సహించాలి

జిల్లావ్యాప్తంగా నేత్రదాన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నేత్రదానం మరింత విస్తృతంగా జరగాలంటే కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు సమీపంలోని నేత్రనిధి కేంద్రాన్ని సంప్రదించి, నేత్రదానానికి అనుమతి ఇచ్చి ఇతరులను కూడా ప్రోత్సహించాలి. – డా.ఎస్‌.పుష్పలత,

జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌

శ్రీకాకుళం అర్బన్‌:

ర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషి శరీరంలో అన్ని అవయవాలు కంటే కంటికి ఉన్న ప్రత్యేకత వేరు. ప్రపంచాన్ని చూడాలంటే కళ్లతోనే సాధ్యమవుతుంది. కంటిచూపు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. అందువలన కంటి చూపు కోల్పోయిన వారికి వెలుగును ప్రసాదించేందుకు నేత్రదానం ఎంతో కీలకమని జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో నేత్రదానంపై అవగాహన పెంపొందించేందుకు 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.

కార్నియా అంధత్వం

కార్నియా సంబంధిత అంధత్వం కారణంగా ఎంతోమంది దృష్టిని కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కార్నియా అంధత్వాన్ని నివారించడంలో నేత్రదానం ద్వారా సేకరించే ఆరోగ్యకరమైన కార్నియాలు ఎంతో ఉపయోగపడతాయి. అందువల్ల మరణానంతరం నేత్రదానం చేయడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని అధికారులు సూచిస్తున్నారు.

కార్నియా అంధత్వానికి కారణాలు

కంటికి గాయాలు కావడం, రసాయనాలు లేదా దుమ్ము, ధూళి పడడం, వరి రేకు, చెరుకు రేకు వంటివి కంటికి తగిలినప్పుడు సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వంటి కారణాలతో కార్నియా దెబ్బతిని శాశ్వత అంధత్వం ఏర్పడే అవకాశం ఉంది. కంటికి ఏదైనా గాయం అయినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి.

ఎవరు నేత్రదానం చేయవచ్చు

నేత్రదానానికి వయసు, కులం, మతం, లింగం వంటి భేదాలు లేవు. సాధారణంగా చాలా మంది వ్యక్తులు నేత్రదానం చేయవచ్చు. రక్తపోటు, మధుమేహం, ఆస్తమా ఉన్నవారు, గతంలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నవారు, కళ్లద్దాలు ఉపయోగించే వారు కూడా నేత్రదానం చేయడానికి అర్హులై ఉండవచ్చు. తుది నిర్ణయం నేత్రబ్యాంకు వైద్య నిపుణులదే. అయితే కొన్ని తీవ్రమైన అంటువ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులు, ఇతర నిర్దిష్ట పరిస్థితుల్లో మరణించిన వారి నుంచి నేత్రాలను సేకరించడం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మరణం సంభవించిన వెంటనే సంబంధిత నేత్ర బ్యాంకు లేదా వైద్య సిబ్బందిని సంప్రదించి వారి సూచనలు పాటించాలి.

నేత్రదానం ఎప్పుడు చేయాలి

ఒక వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా.. సాధారణంగా 6 నుంచి 8 గంటల్లోపు నేత్రదాన ప్రక్రియను పూర్తి చేయాలి. ముందుగా నేత్రదాన ప్రతిజ్ఞ చేయవచ్చు. ప్రతిజ్ఞ చేయకపోయినా మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించవచ్చు. మరణం సంభవించిన వెంటనే దాత తలను కొద్దిగా ఎత్తి ఉంచాలి. రెండు కళ్లను మూసి, శుభ్రమైన చల్లటి తడి వస్త్రం లేదా తడి దూదిని కళ్లపై ఉంచాలి. వీలైనంత త్వరగా సమీపంలోని నేత్రబ్యాంకు, కంటి ఆస్పత్రి, రెడ్‌క్రాస్‌ నేత్రనిధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా జిల్లా ఆస్పత్రిని సంప్రదించాలి.

నేత్రదానం ఎందుకు అవసరం

దేశంలో ప్రతీ సంవత్సరం అనేక మంది వివిధ కారణాలతో మరణిస్తున్నప్పటికీ, మరణానంతరం నేత్రదానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరోవైపు ప్రతి సంవత్సరం కొత్తగా కార్నియా అంధత్వ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజల్లో నేత్రదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు మరణానంతరం తమ కళ్లను బూడిదపాలు కాకుండా, మట్టిపాలు కాకుండా, మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపేలా నేత్రదానం చేయాలని అధికారులు పిలుపునిస్తున్నారు. నేత్రదానాన్ని ప్రతి కుటుంబం ఒక సామాజిక బాధ్యతగా, కుటుంబ సంప్రదాయంగా స్వీకరించాలని కోరుతున్నారు. అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేత్రదాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నారు.

కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్ర చికిత్స తర్వాత

నల్లగుడ్డు అంధత్వం

శస్త్ర చికిత్సకు ముందు

అపోహలు తొలగించాలి

నేత్రదానంపై ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయి. నేత్రదానంపై మరింతగా అవగాహన కల్పించి వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. దేశంలో కార్నియా సమస్య వలన చూపు కోల్పోయినవారు 12 లక్షల మంది ఉన్నట్లు సర్వే చెబుతోంది. నేత్రదానం ద్వారా ఇటువంటి వారికి చూపు తిరిగి పొందే అవకాశం ఉంది. ఏడాదికి సుమారు 1.5 లక్షలు నుంచి 2 లక్షల కార్నియాలు అవసరం కాగా.. కేవలం 30 వేల కార్నియాలు మాత్రమే సేకరించడం అవుతోంది.

– డా.పి.శ్రీకాంతి,

కార్నియా ప్రత్యేక నేత్ర వైద్య నిపుణురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement