టెక్కలి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు, పెన్షనర్లపై నిర్లక్ష్య వైఖరి తగదని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర కార్యద ర్శి దివ్వల పోలయ్య బుధవారం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వైపు నిరుద్యో గ సమస్య, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పడుతున్న అవస్థలు ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 5 డీఏలు బకాయి పడిందని పేర్కొన్నారు. పీఆర్‌సీ కమిషన్ నియామకం విషయంలో తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే 30 శాతం వరకు ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీ మండలానికి సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్‌తో సంఘాలు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల సమక్షంలో వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరారు. ఆరోగ్య సేవల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి సేవలు అందజేయాలన్నారు. రైళ్ల ప్రయాణంలో ప్రత్యేక రాయితీ కల్పించాలని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.


