ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శితో వీసీ భేటీ | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శితో వీసీ భేటీ

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజనీ బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె.శ్యామలరావును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. సెప్టెంబర్‌లో వర్సిటీలో నిర్వహించతలపెట్టిన మూడో స్నాతకోత్సవం గురించి ఆయనతో చర్చించారు. అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహకారం అందజేయాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

రణస్థలం: మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన గుడివాడ అప్పలనర్సయ్య, మరో వ్యక్తి కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఇరువురికీ తీవ్ర గాయాలైనట్లు జేఆర్‌పురం పోలీసులు తెలిపారు. స్థానికులు, జేఆర్‌పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణాపురం గ్రామానికి చెందిన గుడివాడ అప్పలనర్సయ్య తన ఇంటికి అవసరమైన ఎలక్ట్రికల్‌ వస్తువులు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై రణస్థలం వెళ్లి తిరిగి వస్తుండగా కృష్ణాపురం, గుమ్మడాం గ్రామాల జంక్షన్‌ వద్ద ఒక ట్రాక్టర్‌ అతివేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న అప్పలనర్సయ్య, వెనుక కూర్చొని ఉన్న ఎలక్ట్రీషియన్‌ లంక ప్రభాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంపై ఒకరిని శ్రీకాకుళం రిమ్స్‌కు, మరొకరిని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.

కారు బోల్తా

రణస్థలం: మండలంలోని పైడిపేట జాతీయ రహదారిపై బుధవారం ఉదయం శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కొత్త కారు అదుపుతప్పి డివైడర్‌ ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న నలుగురు చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు. అందరూ సురక్షితంగా బయటపడడంతో అంతా ఉపిరిపీల్చుకున్నారు. హైవే పెట్రోల్‌ పోలీసులు వచ్చి సపర్యలు చేసి అక్కడ నుంచి పంపివేశారు. దీనిపై ఎటువంటి పిర్యాదు అందలేదని జేఆర్‌పురం ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.

రెండు చోరీ కేసుల్లో నలుగురు అరెస్ట్‌

పెందుర్తి : సబ్బవరం–షీలానగర్‌ రోడ్డు పనులకు వినియోగించే ఐరన్‌, కేబుల్‌ వైర్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులను పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4.5 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి క్రైం పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో క్రైం ఏసీపీ ఎ.వెంకటరావు వివరాలు వెల్లడించారు. సబ్బవరం–షీలానగర్‌ రోడ్డు పనుల నిమిత్తం పెందుర్తి మండలం నందవరపువానిపాలెం సమీపంలో ఐవోసీఎల్‌ సంస్థ ఐరన్‌, కేబుల్‌ వైర్లను నిల్వచేసింది. ఈ నెల 8న సైట్‌ ఇన్‌చార్జి తోట సునీల్‌రాజ్‌ సామగ్రి సరిచూడగా అందులో దాదాపు రూ.3 లక్షల విలువైన ఐరన్‌, కేబుల్‌ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు.

– గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి అనుసంధానంగా నిర్మిస్తున్న సబ్బవరం–షీలానగర్‌ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం జేపీ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ నరవ వద్ద సెంటరింగ్‌ ప్లేట్లు, యూ జాకీలు, బేస్‌ జాకీలు భద్రపరిచింది. గత నెల 10న సైట్‌ సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ వంకా శివశంకర్‌ సామగ్రి పరిశీలించగా రూ.1.50 విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆయా చోరీల విషయంలో ఫిర్యాదులు అందుకున్న పెందుర్తి క్రైం విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని కొబ్బరితోట(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కుప్పిలి)కి చెందిన అలపాన రెడ్డి(29), పూర్ణామార్కెట్‌ కల్లు పాకల(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా లోపెంట)కు చెందిన నాయన అసిరిబాబు(30), పూర్ణామార్కెట్‌ ప్రసాద్‌ గార్డెన్స్‌(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వెంకయ్యపేట)కు చెందిన దల్లి గోవింద్‌(29), 104 ఏరియాకు చెందిన పరపటి సంతోష్‌కుమార్‌(31) ఆయా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను బుధవారం నగరంలో మాటు వేసి పట్టుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. వారిని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచిన వెస్ట్‌ జోన్‌ క్రైం సీఐ బి.తిరుమలరావు, పెందుర్తి క్రైం ఎస్‌ఐ డి.సూరిబాబు, ఏఎస్‌ఐ కె.శ్రీనివాసరావు, హెచ్‌సీ వి.పేరయ్యనాయుడు, పీసీలు బి.దేముడునాయుడు, ఎల్‌.తాతారావులను ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement