న్యూస్‌రీల్
శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026
దూసిలో రైలు దిగుతున్న గాంధీజీ (ఫైల్)
మన స్వేచ్ఛకు ఎనిమిది పదుల వయసొచ్చింది. మనలో ఆ స్వేచ్ఛా పిపాస రగిల్చి స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులూదిన మహాత్ముడు సిక్కోలు గడ్డపై కాలు మోపి అప్పుడే వందేళ్లు. కానీ ఆయన జ్ఞాపకాలు.. ఆయన ఆనవాళ్లు నేటికీ జిల్లా గుండెల్లో పదిలం. అవే ఆ శాంతి దూతకు కట్టించాయి ఓ ఆలయం.
శ్రీకాకుళంలో
గాంధీజీ
బసచేసిన భవనం (ఫైల్)
శ్రీకాకుళం కల్చరల్ :
మహాత్మాగాంధీ స్మృతులు జిల్లా ప్రజల మదిలో ఇంకా కదలాడుతునే ఉన్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఆయన పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ మార్గమధ్యలో శ్రీకాకుళంలోనూ బస చేశారు. తొలిసారిగా 1927 డిసెంబరులో మహాత్ముడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం, ఖాదీ ప్రచారంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించారు.
● శ్రీకాకుళం టౌన్ బస: 1927 డిసెంబరు 2న శ్రీకాకుళం చేరుకున్న మహాత్ముడు, తొలిరోజు పాలకొండ రోడ్డులో ఉన్న ప్రముఖ ఉద్యమకారుడు ఎంబాడ హనుమంతరావు ఇంట బస చేశారు. ఆ సమయంలో శ్రీకాకుళం పురపాలక సంఘం ఘనంగా సత్కరించింది. ఈ పౌరసన్మాన సభలో ఖద్దరు వస్త్రంపై రాసిన సన్మాన పత్రాన్ని గాంధీకి అందజేశారు. ఆయన దానిని అక్కడే వేలం వేయగా, నాటి ప్రముఖ న్యాయవాది వెంట్రాప్రగడ సూర్యారావు రూ.250కు కొనుగోలు చేశారు. తనను చూసేందుకు వచ్చిన మహిళలతో హరిజనోద్ధరణకు మీ వద్ద ఉన్న ఆభరణాలు ఇవ్వాలని కోరగా మహిళలంతా విరాళంగా అందించారు.
● గాంధీజీ శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం ప్రాంతం వరకు పర్యటించడానికి హిరమండలానికి చెందిన అంధవరపు వెంకటరెడ్డి తన కారును ఇచ్చారు. ఆ కారును శ్రీకాకుళం పట్టణానికి చెందిన మెకానిక్ అక్రం నడిపారు.
● సారవకోట సందర్శన: గాంధీజీ సారవకోట గ్రామాన్ని సందర్శించారు. అక్కడ స్థానిక నాయకుడు బోయిన అప్పలస్వామి ఆతిథ్యం ఇచ్చారు. ఆ రాత్రి గాంధీజీ అక్కడి ’గ్రామ చావడి’ (పూరిపాక) లోనే నిద్రించారు.గాంధీజీ బస చేసిన స్థలంలో ఆయన జ్ఞాపకార్థం రూ. 1.5 లక్షలతో గాంధీ స్మారక గ్రంథాలయం భవనాన్ని నిర్మించారు.
● శ్రీకాకుళం పర్యటన ముగించుకుని నాటి అసిస్టెంట్ ఇంజనీర్ హరీష్ చంద్ర పాఢీ తన కారులో బ్రిటీష్ వారి హెచ్చరికలను లెక్కచేయకుండా గాంధీజీని పర్లాకిమిడికి తీసుకువెళ్లారు.
● 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ ‘దూసి’ రైల్వే స్టేషన్‌లో రైలు ఆగినపుడు దిగి అక్కడి ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. అక్కడ ఒక మర్రి మొక్కను నాటినట్లుగా ఇంటాక్ ప్రతినిధులు గుర్తించారు. అది నేడు ఒక పెద్ద మహా వృక్షంగా మారి పర్యాటకులను ఆకర్షిస్తోంది.
● గాంధీజీకి గుడి : శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా గాంధీజీ కోసం ఒక ఆలయాన్ని (గాంధీ మందిరం– ఫ్రీడమ్ ఫైటర్స్ స్మృతి వనం) నిర్మించారు.
సారవకోట: గాంధీజీ బస చేసిన ప్రదేశంలో నిర్మించిన గ్రంథాలయం
మహాత్ముడు నడయాడిన నేల
పలుమార్లు సిక్కోలులో బస చేసిన గాంధీజీ
ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న జిల్లావాసులు
దూసిలో గాంధీజీ నాటిన మర్రిచెట్టు (ఫైల్)


