రాత్రి 7 గంటలకు అదృశ్యం.. ఉదయం 6 గంటలకు ప్రత్యక్షం | - | Sakshi
Sakshi News home page

రాత్రి 7 గంటలకు అదృశ్యం.. ఉదయం 6 గంటలకు ప్రత్యక్షం

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

రెండున్నరేళ్ల బాలుడిని వెతికేందుకు

అర్థరాత్రి పోలీసుల వెతుకులాట

15 బృందాలతో రాత్రంతా సాగిన

సెర్చ్‌ ఆపరేషన్‌

రణస్థలం : రావాడ గ్రామంలో గుండు మోహిత్‌ అనే రెండున్నరేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన పోలీసులను పరుగులు పెట్టించింది. బాలుడు చివరకు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో తల్లి సునీత పొలానికి వెళుతూ పక్కనే ఉన్న తోటి కోడలికి కుమారుడిని అప్పగించింది. రాత్రి 7గంటలైనా ఇంటికి రాకపోవడంతో పక్క ఇంటికి వెళ్లి అడిగింది. తన దగ్గర లేడని, నీ వెనకే వచ్చేశాడని తెలియజేయగా భర్త సంతోష్‌తో పాటు కుటుంబ సభ్యులంతా రాత్రి 10 గంటల వరకు వెతికారు. చేసేది లేక జే.ఆర్‌.పురం పోలీసులకు రాత్రి 10.30 గంటలకు ఫిర్యాదు చేశారు.

ఆపరేషన్‌ సాగిందిలా..

రాత్రి 11.30 సమయంలో కేసు నమోదు చేశాక జే.ఆర్‌.పురం సీఐ ఎం.అవతారం, ఎస్సై వి.సత్యనారాయణ, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 12.30 గంటల సమయంలో జిల్లా కేంద్రం నుంచి భారీగా పోలీసులు తరలివచ్చారు. టార్చ్‌ లైట్లు, నైట్‌ డ్రోన్లు, డాగ్‌ స్క్వాడ్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌తో సహా 15 ప్రత్యేక బృందాల సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టాయి. ఒంటి గంట సమయంలో ఇంటికి 100 మీటర్లు దూరంలోని పొలం బురదలో బాబు పాద ముద్రలు గుర్తించారు. అప్పటి వరకు ఆ ప్రదేశంలో తిరిగిన అనుమానాస్పద వ్యక్తులపై ఆరా తీసి సెల్‌ లోకేషన్‌ ప్రకారం ఓ వ్యక్తిని స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇలా ఐదు గంటల ఉత్కంఠ తర్వాత తెల్లవారి 6 గంటల సమయంలో ఇంటికి 300 మీటర్ల దూరంలో కొబ్బరి తోటలోని తుప్పల నుంచి బాబు బుల్లిబుల్లి అడుగులు వేసుకుంటూ ఇంటి వైపు నడుచుకుంటూ రావడాన్ని అందరూ గమనించి ఊపిరిపీల్చుకున్నారు. అయితే అంతవరకు బాబు ఆచూకీ కనిపించకపోవడం మిస్టరీగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement