● ఆదరణ చూసి ఓర్వలేకే
ఆమదాలవలస: వైఎస్ జగన్ పర్యటనకు వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఇన్ని కక్ష సాధింపులకు పాల్పడుతున్న నారా లోకేష్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆమదాలవలస వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ గ్రామం రావికంటిపేటలో ఆయన తల్లి శ్యామలమ్మను, కుటుంబ సభ్యులను బుధవారం వారు పరామర్శించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ జిల్లా పర్యటనకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చారని, ఎవరూ సమీకరణ చేయలేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ కూడగట్టుకున్న అభిమానానికి నిదర్శనం ఈ జనాలని పేర్కొన్నారు. ఈ జనాలను సాకుగా చూపుతూ చింతాడ రవికుమార్‌తో సహా సుమారు 20 మంది నాయకులపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయ డం పూర్తిగా రాజకీయ కక్షసాధింపేనని ధర్మాన ఆరోపించారు. ఈ కేసులు పోలీసుల స్వతంత్ర నిర్ణయం కాదని, రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే నమోదు చేశారని విమర్శించారు. విధుల్లో ఉన్న పోలీసులు సైతం అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జర గలేదని చెబుతున్నారని, అయినా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. శ్రీకాకుళం, రణస్థలం, ఆమదాలవలస ప్రాంతాల్లో జరిగిన చర్యలన్నీ ప్రజల్లో ప్రభుత్వం ఆదరణ కోల్పోతున్నదనే భయానికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్యంలో కేసులు పెట్టడం, జైళ్లకు పంపించడం ద్వారా ప్రజల అభిమానాన్ని తగ్గించలేరని, అలాంటి చర్యలు బాధితుల పట్ల ప్రజల్లో మరింత సానుభూతి, మద్దతు పెంచుతాయని ధర్మాన అన్నారు.
చరిత్రలో పోలీసు వ్యవస్థను రాజకీయ ప్ర యోజనాల కోసం దుర్వినియోగం చేసిన ప్రభుత్వా లు ప్రజల తీర్పు నుంచి తప్పించుకోలేవన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు శాఖతో ఎలాంటి విభేదాలు లేవని, తమ పోరాటం ప్రజలను మోసం చేశారని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైనే తప్ప అధికారులపై కాదన్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా రోడ్లపైకి రావడం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదని, ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారని అన్నారు. కేసులు ఎదుర్కొంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తుందని ధర్మాన తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత చురుగ్గా ప్రజల్లోకి వెళ్లి జరుగుతున్న పరిణామాలను వివరించాలని పిలుపునిచ్చారు.
అక్రమ కేసులు దుర్మార్గం
కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్య ల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తోందని మాజీ ఉపముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చింతాడ రవికుమార్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చట్టపరమైన పోరాటం ద్వారా అక్రమ కేసులను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఆమదాలవలస పార్టీ క్యాడర్ అంతా బలంగా ఉందని, అందరూ చింతాడ రవికుమార్‌కు మద్దతు తెలపడం చూస్తుంచే చాలా ముచ్చటగా ఉందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ టెక్కలి, ఇచ్ఛాపురం సమన్వయకర్తల పేరాడ తిలక్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, పార్టీ శ్రీకాకు ళం నియోజకవర్గ పరిశీలకుడు పిన్నింటి సాయి, పార్టీ ముఖ్య నాయకులు కరిమి రాజేశ్వరరావు, మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయరావు, చిట్టి జనార్ధనరావు, ఆరంగి మురళీధర్, గొండు కృష్ణ, నర్తు నరేంద్ర యాదవ్, సురవపరపు నాగేశ్వరరావు, బెజ్జిపురపు రామారా వు, లోలుగు కాంతారావు, చింతాడ శ్యాంప్రసాద్, బెవర మల్లేశ్వరరావు, ఖండాపు గోవిందరావు, పొడుగు శ్రీనివాసరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, దుంపల శ్యామలరావు పాల్గొన్నారు.


