సోంపేట: సోంపేట పరిసర గ్రామాల నిరుద్యోగులకు పట్టణంలో వెలసిన ఓ ప్రైవేటు శిక్షణ కేంద్రం కుచ్చుటోపీ పెట్టింది. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడానికి శిక్షణ అందజేస్తామ ని నమ్మబలికి సోంపేటలో ఆరు నెలల కిందట బస్టాండు సమీపంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. శిక్షణ కేంద్రంలో వందలాది మంది విద్యార్థులను చేర్చుకున్నారు. రైల్వే, బ్యాంక్, డీఎస్సీ, ఉద్యోగాలతో పాటు ఎంసెట్ ర్యాంకులు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఉద్యోగం ఇచ్చేవరకు శిక్షణ అందజేస్తామని చెప్పి నిరుద్యోగుల వద్ద లక్షల రూపాయలు ఫీజు వసూ లు చేశాడు. అలాగే పట్టణంలో పలు దుకాణాల్లో మౌలిక వసతుల కోసం పలు వస్తువులు, కిరాణా తెచ్చి వారికి నగదు ఇవ్వకుండా బోర్డు తిప్పినట్లు తెలుస్తుంది. రాత్రికి రాత్రి శిక్షణ కేంద్రానికి తాళాలు వేయడంతో శిక్షణకు ఫీజులు కట్టిన విద్యార్థులు, నిరుద్యోగులు ల బోదిబోమంటున్నారు. సుమారు కోటి రూపాయలు వరకు నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
మెయిన్ డ్రాప్ కూల్చివేతపై రైతుల ఆందోళన
సంతబొమ్మాళి: పాలతలగాం వద్ద వంశధార కాలువలో వేసిన మెయిన్‌డ్రాప్ పిల్లర్ కూల్చివేతపై రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. మెయిన్‌డ్రాప్ పిల్లర్ కూల్చివేయడంతో సాగునీరు ఈ ప్రాంతానికి అందదని, సు మారు 1500 ఎకరాలు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు అంటున్నారు. గతంలో వంశధార అధికారులే డ్రాప్‌ను ఏర్పాటు చేసి ఇప్పుడు అ అధికారులే కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. దీనిపై వంశధార జేఈ అప్పలరెడ్డిని సంప్రదించగా.. మెయిన్ డ్రాప్ వల్ల దిగువన ఉన్న వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఉందని, దీంతో కూల్చేశామని తెలిపారు.
‘డ్రగ్స్ నియంత్రణకు యుద్ధానికి సిద్ధం’
అరసవల్లి: బంగారు భవిష్యత్‌ను అంధకారంలో పడేస్తున్న డ్రగ్స్ నిర్మూలనపై యువతే ముందడుగు వేసి యుద్ధానికి సిద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో మై భారత్ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ న మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ వికాస్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగిస్తూ ఎందరో అమాయక యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్థాలను తెలిసేలా అవగాహన కలిగించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మత్తు పదార్థాల నియంత్రణ–యువత పాత్రపై జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. పోటీల అనంతరం విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ, డీఎల్‌డీఓ భాస్కరరావు, సెట్‌శ్రీ సీఈ ఓ అప్పలనాయుడు, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.
‘ప్రజా సానుకూల దృక్పథం పెరగాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, హాస్టళ్ల నిర్వహణపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వినతిపత్రాల పరిష్కారంలో జాప్యం జరిగితే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని, అందుకే గడువు దాటిన అర్జీల సంఖ్యను సున్నాకి తగ్గించాలన్నారు. హాస్టల్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం అందించేలా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.


