ముగ్గురిని కబళించిన కిడ్నీ వ్యాధి | - | Sakshi
Sakshi News home page

ముగ్గురిని కబళించిన కిడ్నీ వ్యాధి

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

ద్దానంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఉచితంగా ఇవ్వాల్సిన మందుల్లో కోత పెట్టి కర్కశత్వం చూపిస్తోంది. చంద్రబాబు ప్రభు త్వం ఏర్పడిన తర్వాత పీహెచ్‌సీల ద్వారా కిడ్నీ రోగులకు ఉచితంగా సరఫరా చేయా ల్సిన మందుల్ని ఒక దశలో పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చిన తర్వాత ఎట్టకేలకు మందుల సరఫరాను పునరుద్ధరించింది. ఇటీవల కాలంలో మళ్లీ ఆ మందుల సరఫరాలో చాలా వరకు కోత విధించింది. గడిచిన 8 నెలల కాలంలో కేవలం రెండు పర్యా యాలు మాత్రమే పీహెచ్‌సీలకు కిడ్నీ వ్యాధిగ్రస్తుల మందుల్ని సరఫరా చేశారు. ఇటీవలే పాత డీఎంహెచ్‌ఓ మందుల కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌కు ఇండెంట్‌ పెడితే అక్కడ చుక్కెదురైంది. బడ్జెట్‌ కేటాయించకుండా ఇండెంట్‌ను బుట్టదాఖలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పీహెచ్‌సీలకు వచ్చిన కిడ్నీ రోగులకు మందుల సరఫరాలో అన్యాయం జరుగుతోంది.

జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉద్దాన ప్రాంతంలో గల 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలకు కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం 12 రకాల మందుల్ని సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం 8 రకాలు మందులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. తాజాగా 8 నెలల నుంచి పీహెచ్‌సీలకు ఇచ్చే మందులను 10 శాతానికి కుదించారు. సుమారు ఒక పీహెచ్‌సీకి ఒక రకమైన మందుల్ని 3వేల నుంచి 4 వేలు టాబ్లెట్స్‌ అవసరమైతే కేవలం గరిష్టంగా 1000 నుంచి 300 మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ మందులు కేవలం పది మంది రోగులకు కూడా సరిపోవడం లేదు.

టెస్టులు ఆస్పత్రిలో.. మందులు మెడికల్‌ షాపులో

పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో కిడ్నీ వ్యాధి గ్రస్తుల మందుల్ని కుదించడం, లభ్యం కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీని వల్ల టెస్టులు పీహెచ్‌సీలో చేసుకొని మందుల్ని బయట మెడికల్‌ షాప్‌లలో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దీని వల్ల అప్పుల పాలవుతున్నా మని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో పీహెచ్‌సీల్లో మందులు సరిపడా సరఫరా చేయకపోవడం, సీహెచ్‌సీల్లో తీసుకొచ్చి రోగులకు ఇవ్వడం, లేదంటే సీహెచ్‌సీలకు, పలాస కిడ్నీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌కి మందుల చీటీలు రాసి రోగులను పంపించడం జరుగుతోంది.

సాధారణ మందుల సరఫరాలోనూ..

కిడ్నీ వ్యాధిగ్రస్తుల మందులతో పాటు సాధారణ మందులు సరఫరాలో కూడా భారీగా కోత విధిస్తున్నారు. వందశాతం ఇండెంట్‌ పెడితే కేవలం 60శాతం మందులు మాత్రమే సరఫరా చేస్తున్నారు.

దాలమ్మ (ఫైల్‌)

కళావతి (ఫైల్‌)

శంకర్‌ (ఫైల్‌)

కంచిలి: జిల్లాలో కిడ్నీ వ్యాధి మరో ముగ్గురిని కబళించింది. కంచిలి మండలంలోని పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడు లండ శంకర్‌(38) మంగళవారం మృతి చెందారు. ఆయన పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో పోరాడుతున్నారు. ఇటీవల గుండె నొప్పి రావడంతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య తిరుమల, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శంకర్‌ తండ్రి కృష్ణమూర్తి కూడా సుమారు 6 నెలల కిందట కిడ్నీ వ్యాధితోనే మృతిచెందారు. తల్లి కొయిరమ్మ కూడా ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.

మరో ఇద్దరు

మందస: మందస మండలం లోహరిబంద పంచాయతీ లోహరిబంద కొత్తూరు, గజ్జివారిపేట గ్రామాల్లో కిడ్నీ వ్యాధితో దాసరి దాలమ్మ, అందాల కళావతి మరణించారు. దాసరి దాలమ్మ(42)కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక ఏడాదిగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతోంది. ఏడు నెలలుగా డయాలసిస్‌ పొందుతూ మంగళవారం మృతి చెందారు. అందాల కళావతి(55) కి ఒక పాప, బాబు ఉన్నారు. ఈమె మూడేళ్లుగా డయాలసిస్‌ చేయించుకుంటూ సోమవారం మృతి చెందారు.

బయటే మందులు కొంటున్నాం

పీహెచ్‌సీల్లో మందులు ఎప్పుడు సరఫరా జరుగుతాయో చెప్పలేని పరిస్థితి. బయట మెడికల్‌ షాపుల్లోనే మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – రంజిత్‌ మజ్జి, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, మజ్జిపుట్టుగ గ్రామం, కంచిలి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement