ఆమదాలవలస రూరల్: వర్షాలు ప్రారంభం కాక ముందే గండ్లు పడుతున్నాయి. ఆమదాలవలస రూరల్ మండలం తురకపేట వద్ద వాడాడ కాలువ వద్ద ఈ గండి పడింది. నారాయణపురం కుడి, ఎడమ కాలువలకు అధికారులు ఈ నెల 15న నీరు విడిచిపెట్టారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా వాడాడ కాలువలకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ కాలువ ద్వారా తురకపేట, నిమ్మతొర్లివాడ, పాతూరు, కొత్తవలస, చీమలవలస, కొర్లకోట, తొగరాం, కలివరం దూసి వరకు వందల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే అన్నదాతులు నీటి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ గండి పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువ పనులు ఇటీవల చేయటంతో పాటు ఇరువైపులా మట్టి తవ్వకాలు చేయటం వల్ల ఈ గండి పడినట్లు ఆ ప్రాంత రైతులు అంటున్నారు.


