ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఐ.టి.ఈ.పి. విభాగంలో ఎకనామిక్స్ కాంట్రాక్ట్ అధ్యాపక పోస్టు భర్తీకి ఈ నెల 16న వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ బి.అడ్డయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 10వ తేదీల్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న పోస్టులకు ఇది అదనమని వెల్లడించారు. పీహెచ్‌డీ పూర్తిచేసి నెట్, స్లెట్ ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోని సంబంధిత సర్టిఫికెట్లు జతచేసి ఉదయం 10 గంటలకు వర్సిటీ పరిపాలనా భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.
మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి
సోంపేట: మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని కోరుతూ సోంపేట మండలం ఉప్పలాం పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ప్రతినిధులు రక్తతర్పణ వేలిముద్రలతో ప్రధానమంత్రి మోదీకి లేఖలు రాశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి పుక్కల్ల ఆరేలమ్మ, ప్రతినిధులు మడికమ్మ, నానమ్మ, లక్ష్మీకాంత తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘చలో పలాస ఆర్డీఓ ఆఫీస్’
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఉదయం 10 గంటలకు చేపట్టనున్న చలో పలాస ఆర్డీఓ ఆఫీస్ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ, ఉద్దాన ప్రాంత ప్రజల భవిష్యత్ కోసం, పచ్చని ఉద్దాన విధ్వంసానికి వ్యతిరేకంగా బాధిత గ్రామాల రైతులు సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహాధర్నాలో బాధిత గ్రామాల ప్రజలంతా పాల్గొనాలని కోరారు.


